ప్రజాశక్తి-పాడేరు: బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చ రాదని, అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అల్లూరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టేందుకు ఏపీ గిరిజన సంఘం నిర్ణయించింది. ఏపీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా కమిటీ సమావేశం గురువారం పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జాతీయ కార్యవర్గ సభ్యులు అప్పలనరస హాజరయ్యారు. వివిధ మండలాల నుంచి ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యవర్గం ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు మే 11న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ప్రధానంగా బోయ/వాల్మీకుల్ని ఎస్టి జాబితాలో చేర్చరాదని, గిరిజన రైతులు సహకరించే చింతపండుకు గిట్టు బాటు ధర కల్పించాలని, కిలో ధర 60 రూపాయలు చొప్పున జిసిసి ద్వారా కొనుగోలు చేయాలనే డిమాండ్ పై కలెక్టరేట్ ముట్టడి చేపట్టేందుకు నిర్ణయించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం గిరిజన సలహా మండలి, ట్రైబల్ కమిషన్‌లో ఎటువంటి చర్చ జరపకుండా ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానాలు చేయడం సరికాదని, ఇది రాష్ట్రంలోని గిరిజన ప్రజానీకాన్ని మోసగించడం అవమానించడమేనని గిరిజన సంఘం జిల్లా కమిటీ అభిప్రాయపడింది. ప్రభుత్వం వీటిపై తక్షణమే స్పందించే వరకు పోరాటం సాగించాలని గిరిజన సంఘం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఏపీ గిరిజన సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు పాలికి లక్కు.. జిల్లా కమిటీ సభ్యులు ఎంఎం శ్రీను. చిరంజీవి కుర్ర నరసయ్య పాంగి రామన్న తదితరులు పాల్గొన్నారు.










