ప్రజాశక్తి-ఉక్కునగరం : కాంట్రాక్టు కార్మికులకు నిలిపివేసిన రూ.2400 వెంటనే చెల్లించేందుకు చర్యలు చేపట్టకపోతే ఆగస్టు 11న వేలాదిమంది కార్మికులతో చలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుందని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు జి.శ్రీనివాసరావు ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరించారు. డబ్ల్యుఆర్‌ఎం డిపార్టుమెంటు వద్ద జరిగిన హెచ్‌ఒడి ఆఫీసు దిగ్బంధం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వారం రోజుల్లో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని యాజమాన్యం నిలబెట్టుకోలేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులపై దాడి చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక నాయకులు నమ్మి రమణ, కెపి.సుబ్రహ్మణ్యం, చట్టి నర్సింగరావు, నందికి తాతారావు, మురళీకృష్ణ, కోన రమణ, అవతారం, పిట్ట రెడ్డి, పితాని భాస్కరరావు, ఎన్ కృష్ణ సూర్య కుమార్, నమ్మి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎంఎంఎస్‌ఎమ్, డబ్ల్యుఆర్‌ఎం హెచ్‌ఒడిలకు వినతిపత్రం అందజేశారు.










