ప్రజాశక్తి-ఉక్కునగరం : కాంట్రాక్టు కార్మికులకు నిలిపేసిన రూ.2400 చెల్లించాలని కోరుతూ ఈ నెల 11న చలో అడ్మిన్ కార్యక్రమం చేపడుతున్నట్లు అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం నిర్ణయించింది. ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జి.శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జులై 13న ఇడి వర్క్స్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఉక్కు యాజమాన్యం హామీ ఇచ్చినా నేటికీ నెరవేర్చలేదన్నారు. ఈ నెల 11వ తేదీ లోపు చెల్లింపునకు చర్యలు చేపట్టకపోతే వేలాదిమంది కార్మికులతో చలో అడ్మిన్ చేపడతామని హెచ్చరించారు. బోనస్, ఇస్‌ఐ, నోటీస్ పే వంటివి కూడా పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో నాయకులు నమ్మి రమణ, బొడ్డ గోవింద్, సోంబాబు, రామిరెడ్డి, సత్యారావు, కోన రమణ, ఉమ్మడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు










