* ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులు సాయిశ్రీనివాస్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో ఉపాధ్యాయు పోస్టుల పునర్విభజన పేరుతో ఇచ్చిన 117 జిఒ ఉత్తర్వులు వల్ల విద్యారంగాన్ని విధ్వంసానికి గురవుతోందని, నూతన విద్యా విధానం పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులు ఎల్.సాయిశ్రీనివాస్ ధ్వజమెత్తారు. నగరంలోని క్రాంతి భవన్‌లో ఎస్‌టియు జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఒకవైపు నాడు-నేడు పేరుతో పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరుతో సిఎం జగన్ ప్రభుత్వం వ్యాపారం చేసుకుంటున్నారని విమర్శించారు. పాఠశాల మౌలిక వసతులు సమకూర్చడం ద్వారా విద్యా ప్రమాణాలు పెరగవని వ్యాఖ్యానించారు. పాఠశాలల సంఖ్యను 117 ఉత్తర్వుల ద్వారా తగ్గించి విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేస్తోందన్నారు. 2025 నాటికి రాష్ట్రంలో 42 వేలును 15 వేల పాఠశాలలకు కుదించాలని లక్ష్యంతో పనిచేస్తోందని ఆరోపించారు. గతేడాది అక్టోబరులో ప్రారంభించిన పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల పునర్వవ్యస్థీకరణ నేటికీ కొనసాగుతుందన్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో 40 శాతం మంది ఉపాధ్యాయులు మానసిక సంఘర్షణలో ఉన్నారన్నారు. ఏ పాఠశాలలో బోధించాలో తెలియని త్రిశంకు స్వర్గంలో కొట్టిమిట్లాడుతున్నారని అన్నారు. దీనివల్ల బోధనా అభ్యసన ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. విద్యారంగ విధానాలు పాఠశాల విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల కౌన్సెలింగ్ విధానాన్ని వదిలి సిఫార్సులకు ప్రాధాన్యత నిస్తున్నారని, ఈ ప్రక్రియ పూర్తయి నాలుగు నెలలు దాటినా 32 వేల మంది ఉపాధ్యాయులకు నాలుగు నెలలుగా జీతాలు అందలేదని పేర్కొన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గురుపూజోత్సవం జరిపే నైతిక హక్కు లేదని అన్నారు. సిపిఎస్ రద్దుచేసి పాతపెన్షన్ విధానం పునరుద్ధరిండం తప్ప మరే ప్రత్యామ్నాయకి అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. పిఆర్‌సి కమిటీకి విధి విధానాలు ఖరారు చేయలేదని, ఆ కమిటీకి విశ్వసనీయత లేదని అన్నారు. బకాయిపడిన పిఆర్‌సి ఎరియర్స్, డిఎలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి 45 శాతం ప్రకటించాలన్నారు. సమావేశంలో అదనపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేడాడ ప్రభాకరరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడాల తమ్మినాయుడు, ఎస్.వి.రమణమూర్తి జిల్లా నాయకులు బి.రమణ, ఇందిర పాల్గొన్నారు.










