Jul 20,2023 22:35

ఎఒకు వినతిపత్రం అందజేస్తున్న కమిటీ ప్రతినిధులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: బడుగు, బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే జిఒ నంబరు 117ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్‌ టి.చలపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌పై కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలల విలీనం పేరిట వేల సంఖ్యలో బడులు మూతపడ్డాయన్నారు. ఉపాధ్యాయ పోస్టులను కుదించి కార్పొరేట్‌ విద్యకు ప్రోత్సహించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే 84, 85, 117 జిఒలను తక్షణమే రద్దు చేసి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 20:1గా నిర్ధారించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. డిటిఎఫ్‌ నాయకులు కోత ధర్మారావు మాట్లాడుతూ లోపభూయిష్టమైన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు తీసుకొచ్చిన అసంబద్ద జిఒలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎఒ రాజేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వి.కామేశ్వరరావు డిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కె.అప్పలరాజు, ఎన్‌.ప్రభాకరరావు, బి.రవి, పి.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.