ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : ప్రభుత్వ విద్యారంగాన్ని కనుమరుగు చేసే 117, 84, 85 జిఒల రద్దుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నగరంలోని పిఎస్‌ఎన్‌ఎం హైస్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు, రీఅపోర్షన్‌మెంట్ నిర్వహించిన విద్యాశాఖ 45 రోజులు గడుస్తున్నా, ఇంతవరకు వారికి జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంఇఒ-1, 2 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, వారికి ఇంతవరకు పని విభజన చేయకుండా వదిలేసిందన్నారు. ఇద్దరు ఎంఇలకు సమాన పని విభజనతో పాటు సమాన గౌరవం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్మోహన్ మాట్లాడుతూ జిఒ నంబరు 60 విడుదల చేసి నెల రోజులు కావస్తున్నా, ఆ ఉత్తర్వుల్లో మంజూరు చేస్తున్నట్లుగా పేర్కొన్న 1452 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను నేటికీ భరీ చేయలేదని విమర్శించారు. 117 జిఒ దుష్ఫలితాలను ఉపాధ్యాయ రంగం చవిచూస్తోందని, ఈ జిఒ రద్దుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు ఎస్.వి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈనెల నుంచి పిఆర్‌సి అమలు చేయాల్సి ఉన్నా, ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించకుండా తాత్సారం చేస్తోందన్నారు. సమావేశంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షులు జి.భీమారావు, పి.అప్పలనాయుడు, కార్యదర్శులు చావలి శ్రీనివాస్, వెంకుమహంతి నవీన్ కుమార్, దాసరి రామ్మోహనరావు, రాష్ట్ర కౌన్సిలర్లు సదాశివుని శంకరరావు, పైడి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.










