ప్రజాశక్తి-కాకినాడ వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద 11,534 మంది కౌలు రైతులకు రూ.8.65 కోట్ల సాయాన్ని నేరుగా జమ చేసినట్టు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకంలో ఐదో ఏడాది, తొలి విడత 1,46,324 మంది కౌలు రైతులకు 109.74 కోట్ల ఆర్థిక సాయాన్ని గత మే, జూన్ నెలల్లో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన 11,373 మంది రైతులకు రూ.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ సహాయాన్ని నేరుగా వారి ఖాతాలకు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ ఎంపీ వంగా గీత, కుడా చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంక ప్రసాద్, జిల్లా లబ్ధిదారు రైతులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం జిల్లాలో కౌలు రైతుల ఖాతాలకు సాయాన్ని జమ చేస్తూ చెక్కును అందించారు. జిల్లాలో గత మే, జూన్ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా 55.41 హెక్టార్లలో పంటలు నష్టపోయిన 256 మంది ఉద్యాన రైతులకు పరిహార మొత్తాన్ని పంపిణీ చేస్తూ చెక్కు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ నాలుగేళ్లుగా నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాల ద్వారా జిల్లాలో 42,894 మంది రైతులకు రూ.57.91 కోట్ల మేరకు పెట్టుబడి సాయం అందించినట్టు చెప్పారు. వరుసగా 5వ ఏడాదిగా ఈ సంవత్సరం తొలి విడతగా మరో రూ.8.65 కోట్ల సహాయాన్ని నేరుగా 11,534 మంది ఖాతాలకు జమ చేశామన్నారు. జెడ్‌పి ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ చెప్పిన దాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు సాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల నిబద్ధతను చాటి చెపుతోందన్నారు. ప్రకతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు అదే సీజను ముగిసే లోపు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి అండగా నిలుస్తోందన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజరుకుమార్, జిల్లా ఉద్యాన అధికారి ఎన్.మల్లికార్జునరావు, వ్యవసాయ అధికారులు జివి.పద్మశ్రీ, గాయత్రి పాల్గొన్నారు.










