ప్రజాశక్తి - నౌపడ: బతుకులను బుగ్గిపాలు చేసే కాకరాపల్లి ఈస్ట్‌కోస్ట్ థర్మల్ పవర్‌ప్లాంట్ జిఒ 1108ను రద్దు చేయాలని రైతుకూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిఒ రద్దు కోరుతూ సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర కూడలిలో చేపట్టిన రిలే దీక్షలకు 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శిబిరం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 2010లో కాకరాపల్లి తంపర భూముల్లో చేపలు వేట చేసుకొని జీవిస్తున్న స్వదేశీ మత్యకారుల చేతుల్లో ఉన్న 3,400 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కాజేసి, థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పెట్టుబడిదారులకు అప్పగించిందన్నారు. నాటి నుంచి మత్స్యకారులు అలుపెరగని పోరాటం చేస్తూ కొనసాగిస్తున్న ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఉద్యమాల ద్వారా ప్లాంట్ నిర్మాణాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి నిర్మాణాన్ని నిలిపివేశారని చెప్పారు. ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా పనిచేసిన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు నేడు అధికారంలో ఉన్నారని, దీనిపై వారు సమాధానం చెప్పాలన్నారు. ఉద్యమ సమయంలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు అమరులయ్యారని తెలిపారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, మత్స్యకారుల భూములు తిరిగి వాళ్లకే అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎన్.వెంకటరావు, థర్మల్ వ్యతిరేక పోరాట నాయకులు మండపాక నరసింగరావు, సూరాడ రాజారావు, కోత శంకర్ ప్రసాద్, పరపటి రాజారావు, హన్నురావు తదితరులు పాల్గొన్నారు.










