Sep 30,2023 19:54

సమావేశంలో మాట్లాడుతున్న కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఈనెల 11వ తేదీ నుంచి 'ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి' అనే నినాదంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటా క్యాంపెయిన్‌ చేపడుతున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. శనివారం సుజాత కన్వెన్షన్‌ సెంటర్లో ఆ పార్టీ విజయనగరం నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనే ఎందుకు కావాలి అనే నినాదంతో ఇంటింటికీ వెళ్లాలన్నారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనను వివరిస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. సచివాలయ కన్వీనర్లు, గహసారథులను సమన్వయం చేసుకుని వెళ్లాలన్నారు. ఆ సచివాలయ పరిధిలోనే ఒక రాత్రి నిద్ర చేయాలన్నారు. మనం చేస్తున్న పనిని క్షేత్ర స్థాయి వరకూ తీసుకు వెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ సేవలను చెబుతూ.. జగన్‌ నాయకత్వం ఎందుకు అవసరమో వివరించాలని సూచించారు.
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టు వెనుక వైసిపి కుట్ర లేదని కోలగట్ల స్పష్టం చేశారు. అమరావతి భూ కుంభకోణం వంటి కేసులు ఇంకా చాలా ఆయనపై ఉన్నాయన్నారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.