ప్రజాశక్తి-గుంటూరు : డీఎస్సీ-1998 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 10, 11, 12 తేదీల్లో విజయవాడలో జరిగే రిలే దీక్షలను విజయవంతం చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ కృష్ణకాంత్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అభ్యర్థులతో కలిసి బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. 1998 డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులు పోస్టింగ్ కోసం అప్పటి నుండి ఆందోళన చేస్తున్నారన్నారు. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 5887 మందిని తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా 4072 మందినే తీసుకున్నారని చెప్పారు. నియామక ప్రక్రియలో రోస్టర్ విధానం పాటించని కారణంగా ఓసీ అభ్యర్థులకు మాత్రమే పోస్టింగులు వచ్చాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు, వికలాంగుల అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన 559 మందికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు. తక్షణమే వారందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అభ్యర్థులు వి.మేరీ సుహాసిని, సారిక, భారతి పాల్గొన్నారు.










