ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : సమగ్ర శిక్ష, కేజీబీవీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జె ఏ సి ఆధ్వర్యంలో ఈ నెల 10 తేదీన కృష్ణా జిల్లా కలక్టరేట్ వద్ద ' వేడుకోలు' నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఉద్యోగుల జె ఏ సి వైస్ చైర్మన్ సి హెచ్ ఎన్ దేవేంద్ర రావు తెలిపారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో దేవేంద్ర రావు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ,కేజీబీవీ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రెగ్యులర్ చేయాలని, సుప్రీం కోర్టు చెప్పినట్లు వెంటనే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోనికి మార్చి మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి తక్షణమే ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. ఇంటి అద్దె సౌకర్యం, కరువుభత్యం, 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలన్నారు. సామాజిక భద్రతా పథకాలైన ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, అమలు చేయాలని,పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేసి, మెరుగైన హెల్త్ స్కీమ్లు అమలు చేయాలన్నారు. అదేవిధంగా ఖాళీ పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు సమగ్ర శిక్ష ఉద్యోగులకు వర్తింపజేయాలన్నారు. ఎక్స్గ్రేషియో 20 లక్షలకు పెంచాలని. పెండింగ్ ఎక్స్గ్రేషి యాలను మానవత్వంతో తక్షణమే చెల్లించా లన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలన్నారు. వారి కుటుంబం లో ఓకరికి ఉద్యోగం ఇచ్చి కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలన్నారు. అన్ని పోస్టులకు ఖచ్చితమైన జాబ్ చార్ట్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి కె వి.వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.










