Mar 17,2023 23:40

ప్రసవించిన బిడ్డ, తల్లి, 108 సిబ్బంది

ప్రజశక్తి-రాజవొమ్మంగి
మండలంలోని వంచంగి గ్రామానికి చెందిన కోసూరి లోవకుమారి అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో వాహనంలోనే ప్రసవించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాలు ప్రకారం... వంచంగి గ్రామానికి చెందిన గర్భిణి కోసూరి లోవకుమారికి నాలుగువ కాన్పుకు శుక్రవారం అధిక పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. 108 వాహనం గ్రామానికి చేరుకొని లోవకుమారిని ఏలేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో గొంటువానిపాలెం గ్రామ శివారుకు వెళ్ళేసరికి పురిటి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో 108 వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి 108 సిబ్బంది చింతపల్లి అర్జున్‌, ఆశ వర్కర్‌ కుమారి ప్రసవం చేశారు. లోవకుమారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది, లోవకుమారి ఇప్పటికే రక్త హీనతతో బాదపడుతుందని ఆశ వర్కర్‌ కుమారి తెలిపారు. డెలివరీ అనంతరం ఏలేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బందిని, ఆశ వర్కర్‌ను లోవకుమారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.