Oct 19,2023 22:17

108 వాహనం

       అనంతపురం ప్రతినిధి : అపత్కాలంలో వేగంగా చేరుకుని సామాన్యుల ప్రాణాలను నిలిపే 108 వాహనాలకు సుస్తి చేసింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే 2020 జులై నెలలో కొత్త వాహనాలొచ్చాయి. వాటికి సరైన మరమ్మతులు, నిర్వహణ సకాలంలో లేకపోవడంతో వాటికి సుస్తి చేస్తున్నాయి. వాహనాలు తరచూ మరమ్మతులకు గురవడం, కండీషన్‌ లేకపోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో ఆపత్కాలంలో వేగంగా బాధితుల వద్దకు చేరోవడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. మడకశిరలో నాలుగు రోజలు క్రితం ఒక బాలుడి మృతి చెందిన సమయంలో వాహనం లేకపోవడంతో మృతదేహాన్ని ద్విచక్ర వాహనంలో తరలించే ఘటన చోటు చేసుకుంది. దీంతో 108 వాహనాల నిర్వహణపై సర్వత్రా చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిఘా వర్గాల ద్వారా ఈ వాహనాల పనితీరుపై ఆరా తీసినట్టు సమాచారం. అయితే అధికారులేమో అంతా బేష్‌ అని సర్ధిజెప్పే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
సగానికిపైగా వాహనాల్లో సమస్యలు
        ఉమ్మడి అనంతపురం జిల్లాలో 108 వాహనాలు 68 ఉన్నాయి. ఇందులో ఎన్ని కండిషన్‌ ఉన్నాయి.. ఎన్ని లేవన్న దానిపై అధికారుల్లోనే స్పష్టత లేకుండా ఉంది. అనంతపురం నగరం పరిసరాల్లోనే ఎంజి పెట్రోల్‌బంకు, రాప్తాడు సమీపంలో నిత్యం మరమ్మతులకు గురవుతూ ఈ వాహనాలు కనిపిస్తూనే ఉంటాయి. దాదాపు సగానికిపైగా వాహనాలు కండిషన్‌లో లేనట్టు సమాచారం. కనీసం స్టెఫీ కూడా లేకుండా కొన్ని నడుస్తుండగా, కొన్నింటి రాత్రి సమయాల్లో లైట్లు కూడా పడని పరిస్థితులున్నాయి. ఇంకొన్నింటికి బ్రేకులు కూడా సరిగాపడని దాఖలాలూ ఉన్నాయి. ఉదాహరణ ఇటీవలనే బెళుగుప్ప మండలం గుండ్లపల్లి వద్ద బ్రేకులు పడక వాహనం ఆగివున్న ట్రాక్టరును ఢ కొట్టింది. గుమ్మగట్ట వద్ద జరిగిన ప్రమాదంలో ఏకంగా 108 వాహన డ్రైవరు ప్రమానాకి గురై చనిపోవడం జరిగింది. తాజాగా కనగానపల్లి మండలంలోనూ ఒక వాహనం ప్రమాదానికి గురైంది. ఇలా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో అటు సిబ్బంది, ఇటు రోగులు అపత్కాలంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది.
బాధ్యులు సిబ్బందే...
         వాహనాలను వేగంగా నడిపే సమయంలో ఎక్కడైనా చిన్నపాటి ప్రమాదం జరిగినా బాధ్యులు సిబ్బందే అవుతున్నారు. ప్రమాదంలో మరణిస్తే కనీసం ప్రభుత్వం వైపు నుంచి సహాయం కూడా అందని పరిస్థితులు నెలకొన్నాయి. గుమ్మగట్ట ప్రమాదంలో 108 వాహన డ్రైవర్‌ చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఆర్థిక సహాయం అందలేదు. తోటి సహోద్యోగులే కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక బెళుగుప్ప వద్ద జరిగిన ప్రమాదంలో డ్రైవర్‌ను బాధ్యుడిని చేసి ఐదు నెలలు వీధుల్లోకి తీసుకోకుండా అధికారులు నిలిపేశారు. ఇలా ప్రమాదాలకు సిబ్బందినే అధికారులు బాధ్యులే చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేతనాలు కూడా సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 280 మంది వరకు 108 వాహన సేవల్లో పాల్గొంటున్నారు. వీరికి ఇప్పటికీ మూడు మాసాలుగా వేతనాలు అందలేదు.
సిబ్బందికి ప్రభుత్వం భద్రత కల్పించాలి
నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు.

       108 వాహన సేవల్లో పాల్గొనే సిబ్బంది ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలను నిలిపే పనిలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారు. అట్టి వారికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తోడ్పాటును మరింత అందివ్వాల్సి ఉంది. వాహనాల నిర్వహణ సరిగా లేకపోవడంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా ఏదైనా జరిగితే వారినే బాధ్యులు చేస్తుండటం శోచనీయం. ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే చర్యలు కూడా ప్రభుత్వం వైపు నుంచి లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం 108 వాహనాల మరమ్మతులతోపాటు, సిబ్బంది సమస్యలను పట్టించుకుని పరిష్కరించాలి.