ప్రజాశక్తి- అనకాపల్లి
2019 ఎన్నికలకు ముందు 108 ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఈనెల 14 నుంచి చేపట్టనున్న సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.శంకర్ రావు, జి.కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 108 ఉద్యోగులను మధ్య దళారీ వ్యవస్థ లేకుండా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో నేరుగా తీసుకుంటామని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని హామీ నేటికీ నెరవేరలేదన్నారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా వారిని కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌లో కలపలేదన్నారు. అరబిందో సంస్థకు 108 అప్పగించడంతో కార్మికుల సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. ప్రతినెల జీతాలు చెల్లించడం లేదన్నారు. వేధింపులతో పాటు వందమంది కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. 108 వాహనాల్లో మందులు అందుబాటులో లేవని, లక్ష కిలోమీటర్లకు పైగా తిరిగిన టైర్లనే వినియోగించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అత్యవసర సర్వీసు అయిన 108 వాహనాలకు తక్కువ ఆయిల్ వినియోగించాలని వేధిస్తున్నారన్నారు. అంబులెన్సులు ప్రమాదానికి గురైతే సిబ్బంది పైన ఆ ఖర్చు వేయడం దారుణమన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్న సిబ్బందికి చెల్లిస్తున్న అరకొర జీతాలు చాలక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీమా సదుపాయం లేదని, వాహనాలకు ఫిట్నెస్ లేదని, సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ 108 ఉద్యోగులు సమ్మెబాట పట్టారని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.










