ప్రజాశక్తి-రాంబిల్లి
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని వాడనర్సాపురం వద్ద ఎన్‌ఎఒబి ప్రధాన గేట్ ముందు నేవీ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన శనివారం నాటికి 104వ రోజుకు చేరింది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేవీ జెఎసి నాయకులు మాట్లాడుతూ 104 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించక పోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఎనిమిది గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించిన జెట్టీ నిర్మాణం చేయాలని, అంత వరకు నేవీ గేట్ లోపల నుంచి చేపల వేటకు ఆధార్ ఆధారంగా అనుమతి ఇవ్వాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు.










