Sep 29,2023 22:36

ప్రజాశక్తి - ఏలూరు
          జిల్లాలో వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర ఐదో విడత కింద 10,490 మందికి రూ.10.49 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. సిఎం జగన్‌ విజయవాడలో పాల్గొన్న రాష్ట్రస్థాయి వైఎస్‌ఆర్‌.వాహనమిత్ర కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి పాల్గొన్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జిల్లా ఉప రవాణా కమిషనరు ఎస్‌.శాంతకుమారి, ఆర్‌డిఒలు కె.శ్రీహరిరాజు, మదాని, లబ్దిదారులైన పలువురు ఆటో డ్రైవర్లు వీక్షించి ముఖ్యమంత్రి సందేశాన్ని ఆలకించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 10,490 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10.49 కోట్లు డెమో చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐలు కె.విజయరాజు, టి.శివప్రసాద్‌, సహాయ ఎంవిఐలు పి.నరేంద్రబాబు, టి.కృష్ణవేణి, విఎల్‌.ప్రవీణ, జి.స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్‌లు నడుపుతూ జీవించే వారికి వాహనమిత్ర ద్వారా ప్రభుత్వం ఏటా రూ.10 వేలు ఆర్థికసాయం అందజేస్తుందన్నారు. 2019 నుంచి ఇప్పటివరకూ నాలుగుసార్లు ఈ సాయాన్ని లబ్ధిదారులకు అందజేయగా, ప్రస్తుతం ఐదోవిడత సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2019-20లో 17,101 మందికి రూ.17.10కోట్లు, 2020-21లో 19,521 మందికి రూ.19.52 కోట్లు, 2021-22లో 18,015 మందికి రూ.18 కోట్లు అందజేశారు. ఏలూరు జిల్లాలో 2022-23లో 10,303 మందికి రూ.10.30 కోట్లు ప్రభుత్వం అందజేసింది. ఐదో విడతగా 2023-24లో 10,490 మందికి రూ.10.49 కోట్లు శుక్రవారం విడుదల చేసిందన్నారు. ఉప రవాణా కమిషనరు ఎస్‌.శాంతకుమారి మాట్లాడుతూ ఆటో, టాక్సీ క్యాబ్‌, మాక్సీ క్యాబ్‌ వాహన యజమానులు, డ్రైవర్లకు వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర అందిస్తుండగా తొలిసారిగా ఈ విడతలో మొబైల్‌ పంపిణీ వాహన యజమానులకు (ఎమ్‌డియు), డ్రైవర్లకు కూడా రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లాలో వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర కింద చింతలపూడి నియోజకవర్గంలో 1442 మందికి, దెందులూరు నియోజకవర్గంలో 1988 మందికి ఏలూరు నియోజకవర్గంలో 1596 మందికి, గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలంలో 243 మందికి, కైకలూరు నియోజకవర్గంలో 1198 మందికి, నూజివీడు నియోజకవర్గంలో 1938 మందికి, పోలవరం నియోజకవర్గంలో 1286 మందికి, ఉంగుటూరు నియోజకవర్గంలో 799 మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం నాయకులు కెఎల్‌.కుమార్‌, నగరబోయిన లీలాకృష్ణ మాట్లాడుతూ వాహనమిత్ర కింద అందిస్తున్న రూ.10 వేలు వాహన ఇన్స్యూరెన్స్‌ కింద రూ. 8 వేలు, ఫిట్‌ నెస్‌ కింద రూ. 2 వేలు, కట్టుకొని ధైర్యంగా వాహనాన్ని నడుపుకుంటున్నామన్నారు. కరోనా సమయంలో కూడా తమకు రూ.వెయ్యి ఆర్థిక సాయంకూడా ప్రభుత్వం అందించిందన్నారు. కెఎల్‌.కుమార్‌ మాట్లాడుతూ బి ఫార్మశీ చదువుకుంటున్న తమ కుమారుడికి నాలుగేళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, రైతులు, మహిళలు, విద్యార్థులు తదితరులకు ఎంతో తోడ్పాటునిస్తున్నాయన్నారు. అయితే భవన నిర్మాణ కార్మికుల మాదిరిగానే ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ని వారు కోరారు.