Apr 16,2023 23:17

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి-పాడేరు:104 లో పనిచేస్తున్న ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం పాడేరులో సిఐటియు ఆధ్వర్యంలో 104 ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధమ మహాసభ నిర్వహించారు. ఈ సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఇచ్చే కొద్దిపాటి జీతాలు మూడు నెలలుగా బకాయిలు ఉన్నాయని తెలిపారు.ఉద్యోగ భద్రత కల్పించి పిఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్‌లో కలపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 104 అంబులెన్స్‌కు ఎంత ప్రాధాన్యతిస్తుందో ఉద్యోగులకు అంతే ప్రాధాన్య ఇవ్వాలని అన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలు ప్రాణంగా పెట్టి పని చేశారని తెలిపారు. తక్షణం అందర్నీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 104 వాహనాలు మరమ్మత్తులకు బడ్జెట్లో పెంచాలని, నూతన వాహనాలు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలపై ఉద్యోగులు ఐక్య పోరాటాలు నిర్వహించి సౌకర్యాలు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శెట్టినాగరాజు, పవన్‌ కుమార్‌, రామ్మూర్తి, రవిరాజు, వరప్రసాద్‌, సూర్యనారాయణ పడాల్‌ తదితరులు పాల్గొన్నారు.