ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : 104 ఎంఎంయు ఉద్యోగులను ఆప్కాస్‌లో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు వీరందరినీ రెగ్యులర్ చేయాలని ఎపి 104 ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు పి.మణి, అధ్యక్షుడు బి.తాతబాబు, కార్యదర్శి ఎస్‌కె ఖాసీం డిమాండ్‌చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు చేపట్టిన ఆందోళనలో భాగంగా బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన మేరకు 104 ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయాలని, జీవో 4459 ప్రకారం పిఎఫ్, ఇఎస్‌ఐ సక్రమంగా అమలు చేయాలని, యాజమాన్యం చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్‌ను అరబిందో సంస్థ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా వేతనాలు సక్రమంగా చెల్లించాలని, బకాయి వేతనాలు అందించాలని కోరారు. వాహనాలకు సకాలంలో సర్వీసింగ్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.ప్రకాష్, అప్పలరాజు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.










