Jun 28,2023 00:35

సత్తెనపల్లి మండలంలో కరపత్రం ఆవిష్కరణ

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 10,11 తేదీల్లో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే 36 గంటలు (పగలు, రాత్రి) ఆందోళనను జయప్రదం చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లీశ్వరి పిలుపునిచ్చారు. మండలంలోని రెంటపాళ్ల, నందిగామ ఐసిడిఎస్‌ సెక్టార్‌ పరిధిలో ఉన్న అంగనాడీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2017 నుండి పెండింగ్‌ లో ఉన్న టి ఎం బిల్లు చెల్లించాలి, వేతనంతో కూడిన మెడికల్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌, అంగన్వాడీ కార్యకర్తలు సుజాత వాణి, ఉమ, పద్మ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : అంగన్వాడీలకు కనీస వేతనాలు, పెన్షన్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని, ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. స్థానిక మద్దినగర్‌లోని ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం జులై 10, 11 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద 36 గంటల నిరసనల్లో అంగన్వాడీలంతా పాల్గొనాలని కోరారు. అంగన్వాడీలు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు చాలక అంగన్వాడీలే అప్పులు చేసి ఎదురు పెటుబడులు పెడుతున్నారని అన్నారు. అత్తెసరు జీతతాలు ఇస్తూ సంక్షేమ పథకాలను దూరం చేస్తున్నారన్నారు. మెడికల్‌ సెలవులు మంజూరు చేయాలన్నారు. అర్హులైన అంగన్వాడీలకు ప్రమోషన్లు కల్పించకపోగా రాజకీయంగా వేధిస్తున్నారని, ఈ నేపథ్యంలో పోరాటామే మార్గమని అన్నారు.