ప్రజాశక్తి -రాంబిల్లి
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని వాడనర్సాపురం వద్ద ఎన్‌ఎఒబి ప్రధాన గేట్ వద్ద 8 గ్రామాల నిర్వాసితులు చేస్తున్న ఆందోళన మంగళవారం నాటికి 100వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా 100 ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం నిర్వాసిత జెఎసి నాయకులు మాట్లాడుతూ ఎనిమిది గ్రామాల నిర్వాసితులు చేపల వేట లేక ఉపాధి పోయి, కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మా పొట్ట మీద కొట్టి మాకు అన్యాయం చేయడం దారుణమన్నారు. 100 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. మా సహనాన్ని పరీక్షించవద్దని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










