Aug 06,2021 13:14

వాషింగ్టన్‌ : ఏదైనా సాధించాలనుకుంటే.. వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఈ వందేళ్ల బామ్మ. సాధారణంగా పురుషులకైనా.. మహిళలకైనా 60 ఏళ్లు పైబడితే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇక 90 సంవత్సరాల గలవారైతే.. వారి శరీరంలో శక్తి పూర్తిగా సన్నగిల్లి.. నిలబడలేక, కూర్చోలేక ఏ వస్తువునూ పట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. అయితే ఈ బామ్మ మాత్రం ఏకంగా 94 ఏళ్ల వయసులో వెయిట్‌లిఫ్టర్‌గా మారి.. అనేక పతకాలను సాధించారు. ఇంతకీ ఈ బామ్మ ఎక్కడివారంటే.. ఫ్లోరిడాకు చెందినవారు. ఆమె పేరు ఎడిత్‌ ముర్వే ట్రైన. ఈమె 94 ఏళ్ల వయసులో జిమ్‌కెళ్లి కఠోర సాధన చేసి.. యువతకు ధీటుగా పోటీల్లో పాల్గొని పతకాలను సాధించారు. ఆమె కఠోర శ్రమకు ఫలితంగా తాజాగా ఆమె గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. ఈ వారం ఆమె శత జయంతిని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమెకు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేసింది. ఈ వీడియోలో ఆమె జిమ్‌లో సాధన చేసేది కనిపిస్తుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఈ వీడియోను 52 వేల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అద్భుతమని.. ఆమె అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని వ్యాఖ్యానించారు.
గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కడంపై ఆమె స్పందిస్తూ.. 'గిన్నీస్‌ బుక్‌లో నాకు స్థానం దక్కడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ వయసులో నా శరీరాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ముందుగా నాకు శిక్షణనిచ్చిన కోచ్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఏదైనా సాధించాలి అని ఎన్నో సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. చివరగా.. వెయిట్‌లిఫ్టర్‌గా మారాలని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా జిమ్‌కెళ్లి బాగా కష్టపడ్డాను' అని అన్నారు. తల్లి గిన్నీస్‌ రికార్డుకెక్కడం ఎంతో సంతోషంగా ఉందని ఎడిత్‌ కుమార్తె హర్షం వ్యక్తం చేశారు. ఇక ఎడిత్‌ ముర్వే స్నేహితురాలు మాట్లాడుతూ.. 'ముర్వే ఇలా చేయడం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తిస్తుంది' అని అన్నారు.

వీడియో https://www.instagram.com/tv/CSM4uxYInBX/?utm_source=ig_web_copy_link