100 రోజుల 'ఉపాధి' పని కల్పించాలి
ప్రజాశక్తి-కావలి రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కరువు పని దినాలు 100 రోజులు పెట్టాలని కోరుతూ సోమవారం ఎంపిడిఒ ఎ వి మోహన్‌కు స్త్రీ విముక్తి సంఘటన మహిళా సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మాట్లాడుతూ తుమ్మలపెంట, అన్నగారిపాలెం, చిన్న రాయుడుపాలెం పెద్దన్నట్టు, చిన్ననట్టు, గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. ఒక్కొక్క గ్రామంలో సంవత్సరానికి ఒకటి లేదా రెండు వారాలు మాత్రమే పనులు పెడుతున్నారని అది కూడా ఒక వారానికి మాత్రమే డబ్బులు వచ్చాయని ఇంకొక వారానికి ఇంతవరకు డబ్బులు రాలేదన్నారు. గత రెండు మూడు నెలల నుండి ఈ గ్రామాల ప్రజలకు పనులు లేక ఖాళీగా ఉంటున్నారని తెలిపారు. వానలు పడితే గానీ ఈ గ్రామంలో వ్యవసాయ పనులు మొదలు కావు కాబట్టి ఈ లోపు ఉపాధి హామీ పథకం ద్వారా వరవ కాలువ, పంట కాలువ, పులుగు కాలువ, అలాగే శ్మశానాలు, ప్రహరీ గోడలు, ఉప్పు కాలువ, బుకింగ్ హోమ్ కెనాల్, ద్వారా ఉపాధి పనులు చేయవచ్చని తెలిపారు. కరోనా తర్వాత ఈ గ్రామాల ప్రజలకు తగినంత పనులు దొరకకపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారని కావున పై సమస్యలను పరిశీలించి ఉపాధి హామీ పథకం కింద ఈ గ్రామాల ప్రజలకు పని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎపిటిఎఫ్ సీనియర్ నాయకులు బి.శ్రీనివాసరావు, నవయువ సంగం వరప్రసాద్, రైతు కూలీ సంఘం నుండి కే యానాదయ్య, గ్రామాల మహిళలు పాల్గొన్నారు.










