Jun 19,2023 00:15

మాట్లాడుతున్న సంఘం ప్రతినిధి

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌: నర్సీపట్నం అభివద్ధి జరగడం తమకు ఆనందదాయకమని, కానీ 100అడుగుల రోడ్డు విస్తరణతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని బాధితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు ఆదివారం స్థానిక రామచంద్ర ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డు విస్తరణ బాధితుల సంక్షేమ సంఘం భవన యజమానులు మాట్లాడుతూ, రోడ్డు విస్తరణకు తాము వ్యతిరేకం కాదని, 80 అడుగులు రోడ్డు విస్తరణ చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. పట్టణం అబివృద్ధి చెందడం తమకు ఎంతో ఆనందదాయకమని రోడ్డు విస్తరణ లో నష్టపోయిన వారికి టిడిఆర్‌ బాండ్లు కాకుండా నష్టపరిహారం చెల్లించడం మంచిదని పేర్కొన్నారు. 100 అడుగుల విస్తరణ చేపట్టినప్పుడు సుమారు 250 కుటుంబాలు నష్టపోతారని, భవిష్యత్తులో తుని రోడ్డు, చింతపల్లి రోడ్డు వంద అడుగుల విస్తరణ చేస్తే అనేకమంది కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఇప్పుడు 100 అడుగులు విస్తరణ చేసినప్పుడు భవిష్యత్తులో తుని, చింతపల్లి రోడ్డు చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని రోడ్లు 100 అడుగులు విస్తరణ చేస్తే ఎంతమంది నష్టపోతారని, ఈ విషయమై ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రస్తుతం నష్టపోతున్న వారందరికీ టి.డి.ఆర్‌ బాండ్లు కాకుండా నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అంటే తమకు అపారమైన గౌరవమని తెలిపారు. అతిపెద్దవైన అనకాపల్లి, తుని వంటి పట్టణాల్లోనే ఈ రకమైన విస్తరణ లేదని, నర్సీపట్నంలోనే వంద అడుగుల విస్తరణ చేయడానికి ఎందుకు పూనుకుంటున్నారో అర్థం కాలేదని పేర్కొన్నారు.ఎమ్మెల్యే, అధికారులు చర్చలు జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.