Oct 01,2023 00:59

మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు

ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌ : నీటి విషయమై కృష్ణా బోర్డు సమావేశం ఈనెల 5న హైదరాబాద్‌లో జరుగుతుందని, మన రాష్ట్రానికి ఉన్న హక్కు ప్రకారం 10 టీఎంసీల నీటి కోసం కృషి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆ నీటిని తాగునీకే ఉపయోగించుకోవాల్సి ఉంటుందని అన్నారు. సత్తెనపల్లి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో శనివారం మంత్రి మాట్లాడుతూ సాగర్‌ ఆయకట్టులో రైతులు వరి సాగు చేయొద్దని, నీటి అవసరాలు తక్కువగా ఉండే పంటలే వేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఆగస్టులో వర్షాభావం మునుపెన్నడూ లేని విధంగా ఉన్న కారణంగా సాగు, తాగు నీటికి ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. కృష్నా డెల్టాలో నీరు కొంత ఆశాజనకంగా ఉన్న దృష్ట్యా ఆ ప్రాంతంలో పంటలకు ఇబ్బంది లేదన్నారు. సత్తెనపల్లి పట్టణంలో తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా చైర్‌పర్సన్‌ సిహెచ్‌ లక్ష్మీ తులసి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 7 అంశాలతో కూడిన అజెండాను ఆమోదించారు. 6వ వార్డు కౌన్సిలర్‌ ఎస్‌.సత్యవాణి మాట్లాడుతూ స్థానిక గ్యాస్‌ ఏజెన్సీ ద్వారా పట్టణంలో సుమారు 6 వేల కనెక్షన్లు ఉన్నాయని, వినియోగదార్ల నుండి ఏజెన్సీ రూ.40 అదనంగా వసూలు చేయడం ద్వారా సుమారు రూ.6 లక్షలు అదనంగా పొందుతోందని చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ పౌర సరఫరాల అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కమిషనర్‌కు సూచించారు.