ప్రజాశక్తి - చిలకలూరిపేట : జగనన్న ఆరోగ్య సురక్షతో సంచలన ఫలితాలు వస్తున్నాయని, తొలి పది రోజుల్లో 4,041 వైద్యశిబిరాల్లో 13.7 లక్షల ఓపీ సేవలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పట్టణంలోని పురుషోత్తమ పట్టణంలో వైద్య శిబిరాన్ని మంగళవారం సందర్శించారు. మొత్తం 10,057 వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నామని, ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందించేందుకు 4 వేల నుంచి 5 వేల మంది ప్రత్యేక వైద్య నిపుణులను నియమించామని తెలిపారు. ఇప్పటివరకు 34 వేల మంది రోగులకు మెరుగైన వైద్యం అవసరం ఉందని గుర్తించి పెద్దాస్పత్రులకు సిఫారుసు చేశారని తెలిపారు. వీరందరికీ ఎంత ఖర్చయినా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుందని చెప్పారు. వీరి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు డీఎంఅండ్ హెచ్‌వోలు, ఆయా గ్రామాల సీహెచ్‌వోలు, ఎఎన్‌ఎంలు పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. వీరు ఆరోగ్యం తిరిగి పూర్వస్థితికి వచ్చే వరకు పర్యవేక్షణ ఉంటుందని, ఆ తర్వాతే వారి కేసు ఆన్‌లైన్‌లో ముగస్తుందని వివరించారు. పురుషోత్తమ పట్టణంలోనే మంగళవారం ఒక్క రోజే 500 మందికిపైగా వైద్యం కోసం వచ్చారని అన్నారు.










