Apr 07,2023 23:59

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమణమూర్తి రాజు

ప్రజాశక్తి అచ్యుతాపురం
ఎన్‌ఎఒబి పరిధిలోని నిర్వాసిత మత్స్యకారులకు ఈ నెల 10వ తేదీ సోమవారం నుంచి పరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నట్లు ఎలమంచిలి ఎమ్మెల్యే యువి.రమణమూర్తిరాజు తెలిపారు. స్థానిక వైసిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాబ్‌ నిర్వాసితుల ధర్నా, పరిష్కారం విషయంపై మాట్లాడారు. 150 రోజులకు పైగా నాబ్‌ నిర్వాసితులు పోరాటం చేశారని, దీంతో 200 పడవలు వేట నిలిచిపోయిందని తెలిపారు. 2000 మత్స్యకార కుటుంబాలు సముద్రంలో చేపలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారికి అన్యాయం జరిగిందని చెప్పారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు నేవల్‌ అధికారులు, ముఖ్యమంత్రి, ఫిషరీస్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లామని, చివరకు ఒక పరిష్కారం వచ్చిందని పేర్కొన్నారు. మొదట విడతగా ప్రతి బోటుకు రూ.2.50 లక్షలు చొప్పున, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.1.30 లక్షల చొప్పున పరిహారం పంపిణీ సోమవారం నుంచి జరుగుతుందని చెప్పారు. మేజర్లకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌ పెండింగ్లో ఉందన్నారు. జీవో నెంబర్‌ 230 ప్రకారం ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున పరిహారం వస్తుందన్నారు. నేవల్‌ బేస్‌ ఆధీనంలో ఉన్న కొప్పుగుండు పాలెం పొలాలకు వెళ్లే రహదారిని గ్రామస్తులకు ఇవ్వడానికి నేవల్‌ బేస్‌ అధికారులు ముందుకొచ్చారని, అందుకు రెండింతల స్థలాన్ని వాకపాడు వద్ద నేవీకి ప్రభుత్వం కేటాయించనుందని తెలిపారు. నేవల్‌ బేస్‌కు అనుకూలంగా పడవలను వెంటనే అక్కడ నుంచి తరలించాలని మత్స్యకారులకు సూచించారు. ఈ సమావేశంలో డిసిసిబి మాజీ చైర్మన్‌ యు.సుకుమార్‌ వర్మ, నాయకులు డిఎస్‌ఎన్‌ రాజు, శ్రీను రాజు, నేవల్‌ బేస్‌ నిర్వాసిత ప్రతినిధులు పాల్గొన్నారు.