Aug 03,2023 22:54

రిలే నిరాహార దీక్ష చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈనెల పదో తేదీ నుంచి నిరవధిక సమ్మె తప్పదని విద్యుత్‌ ఉద్యోగ సంఘాల జెఎసి జిల్లా చైర్మన్‌ ఎం.వి గోపాలరావు, పలాస డివిజన్‌ అధ్యక్షులు గార రాజారావు హెచ్చరించారు. దశల వారీ ఉద్యమంలో భాగంగా నగరంలోని సర్కిల్‌ కార్యాలయం ఎదుట విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డిఎలను తక్షణమే విడుదల చేయాలని, విద్యుత్‌ సర్వీసుల్లో జాప్యానికి లైన్‌మెన్లను, ఇతర ఉద్యోగులను బాధ్యులను చేస్తూ వేతనాల్లో కోతలు విధించడం తగదన్నారు. తక్షణమే ఉద్యోగులకు పిఆర్‌సిని ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న షిఫ్ట్‌ ఆపరేటర్లు, రీడింగ్‌ ఆపరేటర్లు, ఇతర కార్మికులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు ఇస్తున్న మస్టరల్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. విద్యుత్‌ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు నగదు రహిత వైద్యసౌకర్యాన్ని అందించాలన్నారు. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చకుంటే విజయవాడలో విద్యుత్‌ సౌధ ముట్టడి తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు పట్నాయక్‌, జి.సురేష్‌ కుమార్‌, సిహెచ్‌.వెంకటేశ్వరరావు, రాకోటి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.