Jul 02,2023 00:51

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఐసిడిఎస్‌ పరిరక్షణ, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం రూ.26 వేలు, పెన్షన్‌, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యుటీ సాధన కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) 10, 11 తేదీల్లో 36 గంటల (పగలు రాత్రి) పాటు కలెక్టరేట్‌ వద్ద చేపట్టే ధర్నాలో అంగన్వాడీలంతా పాల్గొనాలని యూనియన్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జి.మల్లీశ్వరి, మెటిల్డాదేవి పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం, సదుపాయాల కల్పనపై జిల్లా కేంద్రంలోని పీడీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌కు వినతిపత్రాన్ని శనివారం ఇచ్చారు. అనంతరం ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి, మెటిల్డాదేవి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు కొన్ని దశాబ్ధాలుగా సేవలందిస్తున్న అంగన్వాడీలకు నేటికీ ఉద్యోగ భద్రత లేదన్నారు. తెలంగాణలో కంటే అధికంగా వేతనం ఇస్తామనే హామీని వైసిపి ప్రభుత్వం విస్మరించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా అంగన్వాడీ సెంటర్ల కుదింపునకు యత్నిస్తోందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం లేదని విమర్శించారు. అనేక పోరాటాల ఫలితంగా 2018లో అంగన్వాడీ వర్కర్లకు రూ.1500, హెల్పర్లకు రూ.750, మినీ వర్కర్లకు రూ.1250 జీతాలు పెంచుతామనే ప్రకటన ఇంకా వాస్తవరూపం దాల్చలేదన్నారు. 2017 నుండి టీఏ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. రకరకాల యాప్‌లు తెచ్చి పనిభారం పెంచారని, మరోవైపు ఐసిడిఎస్‌కు నిధుల్లో కోత పెట్టారని విమర్శించారు. అంగన్వాడీలను ఫుడ్‌ కమిషనర్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ, రాజకీయ నాయకులు అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాజెక్టులోని హనుమాయమ్మను రాజకీయ కక్షలతో దారుణ హత్యకు గురైనట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నిర్వహించే పోరాటాల్లో అంగన్వాడీలంతా కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కోశాధికారి ఎ.ప్రసన్న, తదితరులుపాల్గొన్నారు.
ప్రజాశక్తి - బెల్లంకొండ : ధర్నాను జయప్రదం కోసం బెల్లంకొండలో అంగన్వాడీలు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. జి.మల్లీశ్వరి మాట్లాడారు. సిహెచ్‌ పుల్లారావు, శోభ, సుజాత, మల్లేశ్వరి, నాగేంద్రం, పార్వతి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : గుంటూరు కలెక్టరేట్‌ వద్ద 10, 11 తేదీల్లో జరిగే ధర్నాకు అంగన్వాడీలు అధిక సంఖ్యలో తరలిరావాలని యూనియన్‌ మంగళగిరి ప్రాజెక్ట్‌ గౌరవ అధ్యక్షులు వి.దుర్గారావు పిలుపునిచ్చారు. మంగళగిరి ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయ సమీపంలో అంగన్వాడీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా పోలవరం నిర్వాసితుల సహాయనిధికి మంగళగిరి ప్రాజెక్టు పరిధిలో వసూలు చేసిన రూ.1760ను నాయకులు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మంగళగిరి పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌ పాల్గొన్నారు.