ప్రజాశక్తి -పాడేరు: అంగన్వాడి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10, 11 తేదీల్లో అల్లూరి జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టే 36 గంటల ధర్నా జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం పాడేరు కేంద్రంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యవర్గం సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఐసిడిఎస్ పరిరక్షణకు, అంగన్వాడిల ఉద్యోగ భద్రత, వేతనాలు పెంపునకు గత కొంతకాలంగా ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకో లేదని తెలిపారు. ఇందుకోసం అఖిలభారత కోర్కెల దినం సందర్భంగా 36 గంటలు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. రోజురోజుకు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని, జీతాలు సరి పోలేదని తెలిపారు. వైసిపి అధికారంలోకి రాకముందు సీఎం జగన్ పాదయాత్రలో అంగన్వాడీలకు మెరుగైన సౌకర్యాలు, వేతనాలు, కార్మికులకు ఉద్యోగ భద్రత, కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ నెరవేర్చ లేదన్నారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన నాటి నుంచి ఐసిడిఎస్ బడ్జెట్ కుదిస్తుందరని, ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతుందని విమర్శించారు. అంగన్వాడీలకు గ్రాట్యూటీ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోలేదన్నారు. 1972 చట్టం ప్రకారం అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులని తెలిపారు. ఐసిడిఎస్ ప్రైవేటీ కరించాలనే కుట్రలో భాగంగా రకరకాల యాప్‌లు తెచ్చి పని భారం పెంచుతున్నారని విమర్శించారు. అంగన్వాడిల ఉద్యమానికి సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కళావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ఆఫీస్ బేరర్స్, పి.వెంకటలక్ష్మి, కే.కొండమ్మ, పెంటమ్మ, కొండమ్మ, మంజుల పాల్గొన్నారు.










