1 నుంచి డివైఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - జిల్లా కార్యదర్శి శివకుమార్
కడప అర్బన్ : నవంబర్ 1, 2, 3 తేదీలలో డివైఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా యువతి యువకులందరూ జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్ లు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల.శివకుమార్ తెలిపారు.ఆదివారం స్థానిక పాత బస్టాండ్ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1980 సంవత్సరం పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నగరంలో అందరికీ విద్యా, ఉపాధి కావాలంటూ ఏర్పాటైన డివైఎఫ్‌ఐ నేడు దేశంలోనే 2.10 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద యువజన సంఘంగా ఎదిగిందని తెలిపారు. యువతకు ఉపాధి కావాలంటూ అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిన సంఘం డివైఎఫ్‌ఐ అన్నారు. తమ దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమంటూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడి అనేకమంది అమరులైన ఘనమైన చరిత్ర కలిగిన సంఘం డివైఎఫ్‌ఐ అని తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన భగత్ సింగ్, రాజ్ గురు సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, బిస్మిల్ ప్రసాద్ లాంటి గొప్ప త్యాగదనులు, ప్రముఖుల వారసత్వాన్ని, దేశభక్తిని యువతలో పెంపొందించడం కోసం వారి జయంతి, వర్ధంతుల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పారు. రక్తదాన శిబిరాలు, ఉచిత ట్యూషన్ పాయింట్లు, కరాటే శిక్షణ కేంద్రాలు నిర్వహించడం, యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా సెమినార్లు, సభలు, సమావేశాలు, ఉద్యోగాల నోటిఫికేషన్ పై అవగాహన సదస్సులు నిర్వహించి సరైన మార్గంలో ప్రయాణించే విధంగా కషి చేస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో నగర అధ్యక్ష,కార్యదర్శులు షాకీర్, డి.ఎం.ఓబులేసు పాల్గొన్నారు.