Aug 22,2023 23:43

సమావేశంలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య

ప్రజాశక్తి-సత్తెనపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అధిక ధరలకు వ్యతిరేకంగా వచ్చేనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకూ విస్తృత ప్రచారం కార్యక్రమాలు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పల్నాడు జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పైర్లు ఎండిపోతున్నాయని, సాగర్‌ నుండి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. మిర్చి, వరి నారుమడులు, వరి నాట్లు వేసుకునేందుకు రైతులు ఇంజన్లతో నీరు పెట్టుకోవాల్సి వస్తోందని, ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మెడ మీద కత్తిలాగా వేలాడుతున్న విద్యుత్‌ బిల్లును పార్లమెంటులో ఆమోదిస్తే రైతులకు, అట్టడుగు వర్గాలకు ఇస్తున్న ఉచిత విద్యుత్తుకు విఘాతం ఏర్పడుతుందని, ఈ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిని కోరారు. దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాల నాయకులతో ఢిల్లీలో గురువారం జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. కార్మిక, కర్షక ఐక్యతతో రెండవ దశ పోరాటానికి సంసిద్ధం కావాలని, నవంబర్‌ 27,28, 29 తేదీల్లో 72 గంటల పాటు అన్ని రాష్ట్ర కేంద్రాల్లో కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కనీసం మద్దతు ధర చట్టం చేయాలని, ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గించాలని, సొసైటీల ద్వారా రైతులకు రుణాలివ్వాలని జరిగే మహోద్యమంలో కార్మిక, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతులు రూ.4.5 లక్షల కోట్ల అప్పులలో ఉన్నారని, వాటిని కేంద్రం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ కంపెనీలకు రూ.11 లక్షల కోట్ల బకాయిలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం 60 కోట్ల రైతులకు సంబంధించిన రుణాలను రద్దు చేయడం కష్టమేమీ కాదన్నారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని, నాగార్జునసాగర్‌ కుడి కాల్వకు నీటి విడుదల విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం విత్తనాలను సరఫరా చేయాలని కోరుతూ తీర్మానాన్ని సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.గోపాలరావు, జి.రవిబాబు, ఎస్‌.ఆంజనేయ నాయక్‌, నాయకులు జి.బాలకృష్ణ, జి.ఉమశ్రీ, డి.విమల, డి.శివకుమారి, కె.హనుమంతురెడ్డి, జి.మల్లేశ్వరి, పి.మహేష్‌, ఎ.వీరబ్రహ్మం, కె.శివదుర్గారావు పాల్గొన్నారు.