
- నేడు వడ్డాది పాపయ్య జయంతి
పురస్కారాలు, ప్రశంసల కోసం కొందరు బొమ్మలు గీయగా...కళ కోసం, కళాభిమానుల కోసం మాత్రమే చిత్రాలను మనకందించిన గొప్ప చిత్రకళాకారులు వడ్డాది పాపయ్య. 1921 సెప్టెంబరు 10వ తేదీన శ్రీకాకుళం పట్టణంలో సామాన్య కుటుంబంలో పుట్టిన వ.పా, బాల్యం నుంచే చిత్రకళపైన మక్కువ పెంచుకున్నారు. భారతీయ పురాణ, ఇతిహాసాలపై విద్యార్థి దశలోనే పట్టు సాధించి ఆ దిశగా తన చిత్రకళా ఆసక్తికి రంగులు, తన భావాలకు కుంచె ద్వారా మెరుగులు దిద్దుకున్నారు. ఆయన కుంచె నుంచి జాలువారిన చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. పురాణ పురుషులు, కావ్య నాయకులు, పల్లె పడుచులు, జాతీయ నేతలు, వివిధ కాలాలు, రుతువులు, పండుగలు, ఆచార వ్యవహారాలు, జానపద విన్యాసాలు, రాగాలు, నదులు, ఊహా లోకాలు....ఒకటేంటి మనిషిలోని, పకృతి లోని అన్ని భావాలు, రూపాలను తన చిత్రాల ద్వారా చూపించారు వ.పా. అందుకే ఆయన గీచిన చిత్రాల కోసం ఒకనాడు తెలుగు నేలపైన సామాన్యుడి నుంచి మేధావులు వరకూ అర్థ శతాబ్దం పాటు ఎదురు చూశారు. నేటికీ అవి సజీవ చిత్రాలుగా నిలుస్తూ ఇప్పటి తరాన్నీ అలరిస్తున్నాయి.
1940 నుంచి 1990 వరకూ తెలుగు నేలపై ప్రచురితమైన పలు పత్రికలు, జర్నల్స్‌కు వడ్డాది పాపయ్య చిత్రాలు ఊపిరిగా నిలిచాయి. ఆయా పత్రికలు ప్రచురించే కథలు, నవలలకు వ.పా గీచిన చిత్రాలు ఎంతో ప్రాచుర్యం పొందడమే కాకుండా వాటి సర్క్యులేషన్‌కు కూడా దోహదపడ్డాయి. రేఖా చిత్రకారుడిగానే కాకుండా కార్టూనిస్టుగా, బొమ్మల కథా రచయితగా బహుముఖ ప్రజ్ఞావంతుడు. 1940వ దశకంలో చిన్నారులను ఆకట్టుకోవడానికి ఆయన 'బాల' పత్రికలో గీచిన చిత్రాలు ఎంతో తమాషాగా, ఆహ్లాదంగా ఉండేవి. చిత్రాలతో పాటు యువ, ఆనందవాణి, నవ్వులు పువ్వులు తదితర పత్రికల్లో గీచిన వందలాది కార్టూన్లు తెలుగు వ్యంగ్య చిత్రకళలకు ఊత్తేజాన్ని నింపాయి. చందమామ, కథా మంజూష తదితర పత్రికల్లో ఎన్నో కథలను కూడా రాశారు. బెంగాలీ రచనలు తెలుగులోకి విరివిగా అనువాదం అవుతున్న రోజుల్లో చిత్రకారునిగా వ.పా చేసిన కృషి ఎనలేనిది. శరత్‌చంద్ర నవలలకు ఆయన గీచిన బొమ్మలు నాటి పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
నిరాడంబరత, మానవతకు దగ్గరగా, ప్రచారానికి, ప్రశంసలకు దూరంగా ఉంటూ...పంచె కట్టులోనూ, కుంచె పట్టులోనూ అసలు సిసలైన తెలుగువానికి నిలువుటద్దంగా నిలిచారు వ.పా. 'వ్యక్తి ఆరాధన వద్దు, నా ఆర్టునే ప్రేమించాలని అభిమానులకు పదే పదే చెప్పే' వడ్డాది పాపయ్య తన జీవితంలోనూ తూ.చ. తప్పకుండా పాటించారు. పత్రికలకు చిత్రాలు అందించే నిమిత్తం మద్రాస్ నగరంలో బిజీ జీవితాన్ని గడిపినప్పటికీ దాని నుంచి బయిటపడి తనకు నచ్చిన జీవన పయనంలో భాగంగా విశాఖలోని అనకాపల్లి దగ్గర వున్న చిన్న పల్లె కశింకోటకు చేరుకున్నారు. అక్కడే శారదా నది ఒడ్డున 'వ.పా వనం (010)' నిర్మించుకొని తన కుమార్తె కుటుంబంతో కలిసి చివరి రోజులు గడిపారు. 1992 డిసెంబరు 30న వ.పా తుది శ్వాస విడిస్తే ... ఒకరోజు తర్వాత ఈ లోకానికి ఆ వార్త తెలిసింది. ఆయన చిత్రకళా సేవను గుర్తించడంలో పాలకులు, పరిశోధకులు విస్మరించిప్పటికీ వారసత్వాన్ని అభిమానులు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో పలు సంస్థలు వ.పా స్మారకార్థం జయంతి, వర్థంతి రోజుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. వ.పా చిరకాల స్వప్నమైన ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేయాలని ఆయన అభిమానుల అభిలాష.
- డా|| గుంట లీలావరప్రసాదరావు,
అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం, సెల్ : 8309519615