Sep 21,2023 07:41
  • వర్షాభావంతో పొట్ట దశలో ఆశించిన పురుగు
  •  తెగుళ్ల వ్యాప్తితో కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయిన పంట

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : సిక్కోలును తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. జిల్లాలో తగినంతగా వర్షాలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో రైతులు పంటలు వేయలేకపోయారు. మరోవైపు వేసిన పంటలూ ఎండిపోవడమో, తెగుళ్లు ఆశించడమో జరుగుతోంది. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొట్ట దశలో ఉన్న పంటకు ప్రస్తుతం కత్తెర పురుగు ఆశించింది. కొన్నిచోట్ల పాముపొడ పురుగూ మొక్కను తినేస్తోంది. పురుగు వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 26,375 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట వేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల 23,593 ఎకరాల్లోనే పంట వేశారు. ప్రధానంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం ఆమదాలవలస మండలంలోని పొందూరు ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగవుతోంది. మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తున్న తరుణంలో కత్తెర పురుగు ఆశించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మోటార్ల సాయంతో పంటను కాపాడుకున్న రైతులకు ఇప్పుడు కత్తెర పురుగు రూపంలో నష్టం వాటిల్లుతోంది. ఈ పురుగులు సాధారణంగా కంకి పైభాగాన్ని తింటాయి. ప్రస్తుతం మధ్యలో నుంచి వెళ్తూ కంకిని తినేస్తున్నాయని రైతులు చెప్తున్నారు కత్తెర పురుగు ఆశించడంతో దిగుబడిపై ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కత్తెర పురుగుతో ఎంతమేర విస్తీర్ణంలో దెబ్బతిందో ఇప్పుడే అంచనా వేయలేమని, దిగుబడి మాత్రం తగ్గుతుందని వ్యవసాయ శాఖాధికారులు అంటున్నారు. సాధారణంగా ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెప్తుండగా, ఈ ఏడాది కొంతమేర దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పాముపొడ పురుగు ఆశించడంతో పంట అంతా ఎండిపోయింది. జి.సిగడాం మండలం గోకర్ణపల్లిలో సుమారు 150 ఎకరాల్లో పంట పోయినట్లు రైతులు చెప్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రతిచోటా మొక్కజొన్న పంటకు ఈ రకమైన తెగుళ్ల ప్రభావం ఉంటుందని వారు అంటున్నారు.

  • సాగునీరు లేక మొక్కజొన్న వైపు మొగ్గు

మొక్కజొన్న పంట లాభదాయకంగా ఉండడంతో ఈ ఏడాది రైతులు ఆ పంట వైపు మొగ్గు చూపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోని వారు, కాలువల ద్వారా సాగునీరు అందుతుందనే నమ్మకం లేని వారు మొక్కజొన్న పంట సాగు చేపట్టారు. ప్రధానంగా మడ్డువలస, నారాయణపురం ప్రాంతాల రైతులు ఎక్కువ మంది వరి నుంచి మొక్కజొన్న పంట వైపు మళ్లారు. ఇప్పుడు మొక్కజొన్న పంట కూడా దెబ్బతినడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు.

  • సగం పంట పోయింది

నేను ఎకరా విస్తీర్ణంలో మొక్కజొన్న వేశాను. వర్షాలు లేకపోవడంతో మోటార్ల సాయంతో నీళ్లు పెట్టాం. పంట బాగా ఉందనుకున్న సమయానికి పురుగు పట్టింది. మొత్తం పంటనంతటినీ పురుగు ఆశించింది. సగానికిపైగా పంట పోయింది. సాగు ఖర్చుల కోసం రూ.60 వేలు వరకు అప్పు చేశాను. కనీసం అప్పు అయినా తీరుతుందో, లేదోనని బెంగగా ఉంది.
- ఎస్‌.చిరంజీవులు, రంగనాథపేట,
పొందూరు మండలం

  • సాగునీరు లేదని మొక్కజొన్న వేశాను

మడ్డువలస, నారాయణపురం కాలువలు మా ప్రాంతం వరకు వస్తున్నా ప్రతి ఏడాది నీరు రావడం లేదు. వర్షాలూ లేకపోవడంతో ఎకరా పొలంలో మొక్కజొన్న వేశాను. వర్షాల్లేక మొక్కజొన్న పంటకు పురుగు పట్టింది. పురుగుమందులు కొడుతున్నా పనిచేయడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
- పి.నారాయణరావు, గోకర్ణపల్లి, పొందూరు మండలం