Nov 04,2023 08:45

-వైసిపి,టిడిపి,జనసేనవి ప్రజావ్యతిరేక రాజకీయాలు
-వివరించేందుకే ప్రజా రక్షణ భేరీ
15న విజయవాడ బహిరంగసభను జయప్రదం చేయండి-బి.వి రాఘవులు
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో:కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి మద్దతిస్తూ వైసిపి, టిడిపి, జనసేనలు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక రాజకీయాలను చేస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు అన్నారు. ఈనెల 15న విజయవాడలో జరగనున్న ప్రజారక్షణ భేరి బహిరంగసభను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సన్నాహాక సభలో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా, దళిత, గిరిజన వ్యతిరేక రాజకీయాలను వైసిపి, టిడిపి, జనసేనలు బలపరుస్తున్నాయన్నారు. వాటిని ప్రజలకు వివరించడమే ప్రజారక్షణ యాత్ర లక్ష్యమని చెప్పారు. దీనిలో భాగంగా 15వ తేది విజయవాడలో జరగనున్న బహిరంగ సభను జయప్రదవ చేయాలని పిలుపునిచ్చారు. దళితులు, గిరిజనుల హక్కులను హరించేలా పార్లమెంటులో చట్టాలు చేస్తున్న బిజెపికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఆ పార్టీలు రాష్ట్రంలో మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. పార్లమెంటులో మద్దతిస్తూ రాష్ట్రంలో సాధికార యాత్రులు చేయడమేంటని ప్రశ్నించారు. వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రుల ఉపన్యాసాలు వింటుంటే హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఒకవైపు సామాజిక న్యాయాన్ని సంహరిస్తూ మరోవైపు తామే కాపాడుతున్నామంటూ ఊరేగింపులు, సంబరాలు చేస్తూ సాధికారితను అపహాస్యం చేశారన్నారు. ఉపాధి హామీ పనులకు కోతలు విధించారని, బడ్జెట్లో నిధులు తగ్గించారని, దీనికి వైసిపి మద్దతు తెలిపిందని చెప్పారు. పనికి ఆహార పథకం మీద ఆధారపడేది ఎక్కువమంది దళితులు, పేదలేనని వివరించారు.
ఇదేం సామాజిక న్యాయం...?
దళితులు, గిరిజనుల హక్కులను హరించడం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగ విలువలను 125 అడుగుల లోతున పాతిపెడుతోందని రాఘవులు వ్యాఖ్యానించారు. ఆ చర్యలను ఏమాత్రం ప్రతిఘటించకుండా, అడుగడుగునా రాజీ పడుతున్న వైసిపి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని పెడుతున్నట్లు చెబుతోందని, ఇదేం సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు. నవంబర్‌ 26న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిసిందని, అది రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజని చెప్పారు. దళితుల హక్కులపైనా, రాజ్యాంగంపైనా, ప్రజాస్వామ్యంపైనా జరుగుతున్న దాడిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ రోజున విగ్రహాన్ని ఆవిష్కరించడం అంబేద్కర్‌కు అపచారం చేయడమేనని రాఘవులు అన్నారు. లౌకికవాదానికి, ఫెడరలిజం, సామాజిక న్యాయానికి ప్రజాస్వామ్యానికి బిజెపి తూట్లు పొడుస్తుంటే, వాటన్నింటికి మద్దతిస్తున్న వైసిపికి అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఉందని భావిస్తే బిజెపి అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల, ప్రజాస్వామ్య, లౌకిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు. ఈ విషయాలన్నిటినీ ప్రజలకు చెప్పేందుకే సిపిఎం ఆధ్వర్యాన ప్రజారక్షణ యాత్ర చేస్తున్నట్టు చెప్పారు. 2024లో ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా చేయాలని, రాష్ట్రంలో దాని పల్లకీ మోస్తున్న మూడు పార్టీలూ తమవైఖరి మార్చుకోవాలని సూచించారు. తమ రాజకీయ వైఖరి స్పష్టంగా ఉందని, బిజెపిని వ్యతిరేకించి వచ్చేవారితో కలిసి పనిచేస్తామని, సానుకూలంగా ఉండేవారిపై పోరాడతామని పేర్కొన్నారు. ఇక్కడ వైసిపి, టిడిపి, జనసేన బిజెపితోసానుకూలంగా ఉన్నాయని తెలిపారు. దీనిపై వారి వైఖరి మార్చుకోవాలని అన్నారు. సిపిఐతో ఉమ్మడిగా వెళ్లేందుకు ప్రయత్నిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ వైసిపి అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో ప్రజలపై పెనుభారాలు పడుతున్నాయని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతోందని వివరించారు.
ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వడం అన్యాయం
పాలస్తీనాపై అన్యాయంగా దాడులు చేస్తున్న ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చే విధంగా ప్రధాన మంత్రి మోడీ వ్యవహరించడం అన్యాయమని బి.వి. రాఘవులు అన్నారు. పశ్చిమాసియా దేశాల్లో ఆయిల్‌పై పట్టుకోసం అమెరికా పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ను ఉసిగొల్పిందని, దీనిద్వారా ఆయిల్‌ ఉత్పత్తి దేశాలపై పట్టుకోసం ప్రయత్నిస్తోందని చెప్పారు.
దీనికి అభివృద్ధి చెందిన దేశాలు మద్దతు ఇవ్వడం, దానికి ఇండియా ప్రధాని వంతపాటడం దారుణమని పేర్కొన్నారు. దాన్ని కూడా ముస్లిం వ్యతిరేక ప్రచారానికి వాడుకుంటూ బిజెపి నాయకులు మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేరళలో బాంబు పేలుడు జరిగితే దానికి హమాస్‌తో లింకుపెట్టి బిజెపి కేంద్ర మంత్రి తప్పుడు ప్రచారం చేశారని, ఆయనపై అక్కడి ప్రభుత్వం కేసు నమోదు చేసిందని అన్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో బిజెపికి ఎదురుగాలి వీస్తోందని చెప్పారు. ఇప్పటికే దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఉపాధి అధారిత పరిశ్రమలు లేవని అన్నారు. ఇదే అంశాన్ని ఇటీవల ఆర్‌బిఐ కూడా నివేదిక ఇచ్చిందని వివరించారు. అంతర్జాతీయంగా చూసినా అన్ని రంగాల్లోనూ దేశం వెనుకబడుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఒక మతానికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఇతర మతాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆ ధోరణి సరికాదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇండియా వేదికలో ఉన్న పార్టీలతో సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందని అన్నారు. దాని తీరుపై ఇప్పటికే నితీష్‌కుమార్‌, అఖిలేష్‌యాదవ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇటువంటి పద్ధతులను కాంగ్రెస్‌ సరిచేసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షత వహించారు. సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, నాయకులు కె.శ్రీదేవి, బోయి సత్యబాబు, కె.దుర్గారావు, బి.రమణ, కృష్ణ తదితరులు పాల్గోన్నారు.