Jul 30,2023 21:14

ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా) :దేశవ్యాప్తంగా చేనేతలు ఐక్యం కావాలని వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుడబ్ల్యుఒ) వ్యవస్థాపక సభ్యులు మునుకుంట్ల రమేష్‌ కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో రమేష్‌ మాట్లాడుతూ కోవిడ్‌ సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న చేనేతలను ఆదుకునేందుకు డబ్ల్యుడబ్ల్యుఒను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యకు అవసరమైన సహాయ సహకారాలపై ఈ సదస్సులో చర్చిస్తామని, సభ్యుల అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో పేద చేనేత కుటుంబాలకు సహకారం అందిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేత సామాజిక తరగతికి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరన్నారు. శాసనసభ, పార్లమెంట్‌లో చేనేతలకు ప్రాధాన్యత పెరిగే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. దీంతో చేనేత రంగ సమస్యలు చట్ట సభల్లో వినిపించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అంతర్జాతీయంగా ఎన్‌ఆర్‌ఐల సహాయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ కె అంజన్‌, వ్యవస్థాపక సభ్యులు ఎ రాజ్‌, ఎబిపిఎస్‌ అధ్యక్షులు కె స్వామి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, ఎల్‌ రమణ, పి అనురాధ, మురుగుడు హనుమంతరావు, కర్నూలు ఎంపి ఎస్‌ సంజీవ రాయుడు, మధ్యప్రదేశ్‌ ఐఎఎస్‌ అధికారి పి నరహరి, ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి, దేవాంగ కార్పొరేషన్‌ చైర్మన్‌ బి సురేంద్ర, పద్మశాలి కార్పొరేషన్‌ చైర్మన్‌ జి విజయలక్ష్మి, ఆల్‌ ఇండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు బి ఆనంద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • చేనేత సదస్సు తీర్మానాలు

చేనేత సామాజిక వర్గాలకు అన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో తగినన్ని సీట్లు కేటాయించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శాసనసభ స్థానాలు చీరాల, మంగళగిరి, రాజమండ్రి రూరల్‌, ఎమ్మిగనూరు, వెంకటగిరి, ధర్మవరం, గాజువాక, పిఠాపురం, పార్లమెంట్‌ స్థానాలు హిందూపురం, కర్నూలు, రాజమండ్రి కేటాయించాలని పేర్కొంది. చేనేత ఉత్పత్తులపై, చిలపల నూలుపై జిఎస్‌టి పూర్తిగా తొలగించాలని, నేషనల్‌ హండ్లూమ్‌ బోర్డ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వ చేనేత సంస్థలను పునరుద్ధరించాలని, 1985 చేనేత రిజర్వేషన్‌ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని, చేనేత సహకార సంఘాల బకాయిలు వెంటనే చెల్లించి చేనేత పరిశ్రమను ఆదుకోవాలని సదస్సులో తీర్మానించారు.