ప్రజాశక్తి -కాకినాడ :తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ ఏపీ అర్బన్ ఏరియా రిసోర్స్ పర్సన్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియకు రిసోర్స్ పర్సన్లు వినతి పత్రం అందించారు. గురువారం రిసోర్స్ పర్సన్ల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సబ్బతి ఫణీశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షురాలు పల్లి జయలక్ష్మిల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జెసికి తన చాంబర్లో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సబ్బతి, జయలక్ష్మిలు మాట్లాడుతూ తాము 2007 నుంచి మెప్మా పరిధిలో రిసోర్స్ పర్సన్లుగా పనిచేస్తున్నామని తమకు వేతనం నెలకు 8వేలు ఇస్తున్నారని కొన్ని నిబంధన వల్ల ఆ ఎనిమిది వేలు కూడా రాకపోగా గ్రామ సంఘాల ఆధ్వర్యంలో వారిని బతిమాలుకుని ఆ వేతనం పొందుతున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము అత్యంత కీలకపాత్ర నిర్వహిస్తున్నామని, నాడు జగన్ పాదయాత్ర చేసిన సందర్భంగా 10 వేలు వేతనం ఇస్తామన్నారు హామీ ఇచ్చారని దాన్ని అమలు చేయాలని వారు కోరారు. అలాగే తమను వర్కర్లుగా గుర్తించాలని, మూడేళ్ల కాలపరిమితి ఉన్న నిబంధన తొలగించాలని, కనీస వేతనం అమలు చేయాలని వారు కోరారు. రోజుకు 320 రూపాయలు చెల్లిస్తున్నారని, తాము సాయంత్రం వేళలో చేసిన పని మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయని పక్షంలో దాన్ని కూడా తగ్గించి ఇస్తున్నారన్నారు. తమ న్యాయమైన కోర్కెలను అమలు చేయాలని ఆయా జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రంలను అంద చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో రాష్ట్ర కార్యాలయంలో తమ ప్రతినిధులు వెళ్లి సమస్యలను వివరిస్తామని సబ్బతి, నాగలక్ష్మిలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ కుమారి, పీవీ దుర్గా, సిహెచ్ రాధాదేవి, ఎస్ నాగలక్ష్మి, జి దేవి, టి ఉష, ఎస్ షకీలా తదితరులు పాల్గొన్నారు.










