Oct 17,2023 22:08

- అట్టహాసంగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
న్యూఢిల్లీ: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. 2021 ఏడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్‌ 'పుష్ప' సినిమాకు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'ఉప్పెన' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు నవీన యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రానికి ఆరు పురస్కారాలు లభించగా, 'పుష్ప: ది రైజ్‌' చిత్రానికి రెండు దక్కాయి. 'ఉప్పెన' ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. 'కొండపొలం' సినిమాలోని 'ధమ్‌ ధమ్‌ ధమ్‌..' పాటకు చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయితగా అవార్డు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌ (పుష్ప), ఉత్తమ నటి అవార్డును అలియా భట్‌ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్‌ (మిమి) అందుకున్నారు. దాదాసాహెబ్‌ పాల్కే జీవితకాల సాఫల్య పురస్కారానికి వహిదా రెహమాన్‌ రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.
జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న తర్వాత అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. తొలిసారి జాతీయ అవార్డ్‌ అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కమర్షియల్‌ చిత్రానికి (పుష్ప) జాతీయ అవార్డు రావడమనేది డబుల్‌ అఛీవ్‌మెంట్‌ అని పేర్కొన్నారు. 'పుష్ప'లోని తగ్గేదేలే డైలాగ్‌ చెప్పి అలరించారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. టాలీవుడ్‌ చరిత్రలో ఎందరో గొప్ప నటులు ఉన్నా ఎవరికీ దక్కని అవకాశం అల్లు అర్జునకి దక్కింది. ఆగస్ట్‌లో జాతీయ పురస్కారాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కేంద్ర సమాచార, ప్రసార సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ పాల్గన్నారు.
ఆరు అవార్డులు రావడం ప్రత్యేకం: రాజమౌళి
'ఆర్‌ఆర్‌ఆర్‌'కు ఆరు అవార్డులు దక్కడం పట్ల రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుందని, దీని కోసం మా టీమ్‌లోని వారంతా నాలుగేళ్లు కష్టపడ్డారని అన్నారు. ఇప్పుడు జాతీయ అవార్డులతో గుర్తింపు మరింత పెరిగిందని, చాలా ఆనందంగా ఉంది' అని రాజమౌళి పేర్కొన్నారు.