- అల్లూరి పేరుతో గిరిజన జిల్లా ఏర్పాటు చేసి గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘిస్తున్న వైసిపి ప్రభుత్వ దుర్మార్గం
- గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు అప్పల నరస ధ్వజం
- పాడేరులో అల్లూరికి ఏపీ జిఎస్ నివాళి
ప్రజాశక్తి-పాడేరు : అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో కార్పొరేట్ కంపెనీలకు ఏజెన్సీ ప్రాంతాల్లో అడ్డుకునేందుకు పోరాటం ఉదృతం చేస్తామని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పలనర్శ అన్నారు. పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివారం అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పి.అప్పలనర్శ మాట్లాడుతూ నాడు అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక గిరిజనులకు సంపదపై అధికారం ఉండాలని, అడవి హక్కు ఇవ్వాలని, బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి గిరిజనుల్లో చైతన్యం వ్యాప్తి చేయడమే, కాక స్వాతంత్ర్య ఉద్యమం లో తన ప్రాణానికి ప్రాణంగా పెట్టీ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన మహనీయుడని అన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడు స్ఫూర్తి ఏజెన్సీ ప్రాంతంలో కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయిన గిరిజన ప్రజా ప్రతినిధులపై పోరాటం ఉదృతం చేయాలని అన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గిరిజనుల అధీనంలో ఉన్న 15వేల ఎకరాల అటవీ భూమిను అదానీ, శిర్డి సాయి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు అప్పగించాలని వైసిపి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని. అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం అప్పగించాలని మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అనుమతి కుడా మంజూరు చేశారని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను అడవి నుండి గెంట్టివేత కు కేంద్ర ప్రభుత్వ అటవీ సంరక్షణ చట్టం సవరణను 2023 పిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశం నిర్ణయం చేశారని చెప్పారు. ఒకపక్క అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడు అంటు మరోపక్క అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తికి విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయం చేయడం సరికాదన్నారు.
అల్లూరి సీతారామరాజు పేరుతో గిరిజన జిల్లా ఏర్పాటు చేసిన వైసిపి ప్రభుత్వం గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘించడంలో ముందు నిలిచిందని, స్థానిక గిరిజన గ్రామంలో పర్యటన చెయ్యకుండానే బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించడంపై అసెంబ్లీ తీర్మానం ఏకపక్షంగా చేయడం అల్లూరి స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. రాజకీయ లబ్దికోసం రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు రేపిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యమం నిర్వహించాలని, ప్రజాతంత్ర వాదులకు, గిరిజనులకు పిలుపునిచ్చారు. జీఓ నెంబర్ త్రీ రిజర్వేషన్ కు చట్టబద్దత కల్పించాలని, అక్రమ మైనింగ్ మాఫియా ఆగడాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షడు పి లక్కు, మండల నాయకులు ఎల్. సుందరరావు, వరహాల బాబు, దాస్, చిన్నారావు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.










