ప్రజాశక్తి-వన్‌టౌన్: ఇంద్రకీలాద్రిపై రెండో రోజు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ యాత్రికులకు దర్శనమిచ్చారు. శ్రీ బాలాత్రిపుర సుందరదేవీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ ఇఒ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయని, అమ్మ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఫుట్ స్కానర్ ద్వారా యాత్రికుల నమోదు : మంత్రి
మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ఫుట్ స్కానర్ ద్వారా యాత్రికుల సంఖ్యను నమోదు చేస్తామన్నారు. మొదటిరోజు జరిగిన లోటుపాట్లను సవరించి పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. పులిహాోర, దద్దోజనం, పొంగలి ప్రసాదంగా భక్తులకు ఉచితంగా పంపిణీ చేయటంతో విడిగా పులిహాోర ప్రసాదం విక్రయం జరిగి ఉండకపోవచ్చన్నారు. ఇంద్రకీలాద్రిపై మీడియాకు తగిన సమాచారంపై దేవాదాయ శాఖ నుండి పిఆర్వోను సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకుంటానని మంత్రి అన్నారు. వికలాంగులకు ప్రత్యేకంగా నిర్ణీత సమయంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారి దర్శనానికిె మోడల్ అతిధి గహం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామన్నారు.
యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు : కలెక్టర్
ప్రజాశక్తి-విజయవాడ: కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు ఎదురైన సమస్యలను పరిష్కరించి త్వరగా అమ్మవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దర్శనం విధానాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తొలిరోజున అమ్మవారి దర్శనానికి వచ్చిన యాత్రికులకు ఎదురైన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించామన్నారు. ఉచిత క్యూలైన్‌లో అమ్మవారిని దర్శించుకుంటున్న సాధారణ యాత్రికులు గంటలోపే అమ్మవారి దర్శనం చేసుకోగలుగుతున్నారని తెలిపారు. క్యూలైన్‌లలో తాగునీటిని ఏర్పాటు చేసేందుకు మరింతమంది వలంటీర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.










