Dec 01,2021 06:49

ప్రజాస్వామ్య విలువలలో ఇంట గెలవలేని అధినేతలంతా చేరి ప్రజాస్వామ్యం గురించి రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు. అమెరికా చెబుతున్న సుద్దులు గురజాడ 'కన్యాశుల్కం' నాటకంలో ''పాటకి నేను... అందానికి మా అప్ప.. అని గాడిద అందిట'' అన్న మధురవాణి డైలాగులను గుర్తుచేస్తున్నాయి. డిసెంబరు 9-10 తేదీల్లో అమెరికా కొన్ని ఎంపిక చేసిన దేశాలతో నిర్వహించ తలపెట్టిన 'ప్రజాస్వామ్య సదస్సు'కు చైనా, రష్యాలను పక్కన పెట్టి తన అడుగులకు మడుగులొత్తే దేశాలను మాత్రమే ఆహ్వానించింది. అమెరికా పాడే పాటకు తాన తందాన అనేవారికే అక్కడ చోటు అని దీని ద్వారా స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడడం అమెరికాకు అవసరం. దీనికి ఇతర దేశాల మద్దతు కూడా వుందని చూపేందుకు భారత్‌, పాకిస్తాన్‌ వంటి దేశాలను చేర్చుకున్నది. అగ్ర రాజ్యం ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తున్న దేశాలను పక్కన పెట్టింది. అమెరికా, దాని వందిమాగధులు ప్రబోధించే ప్రజాస్వామ్యంలో ప్రజాతంత్రం నేతిబీరకాయలో నెయ్యి చందమే. ప్రజాస్వామ్యం అనేది ఏదో కొద్ది దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే సాధనం కాదు. అదొక సార్వత్రిక హక్కు. ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది అంతిమంగా నిర్ణయించాల్సింది ఆ దేశ ప్రజలు మాత్రమే. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కుట్రల ద్వారా కూల్చేవారు ప్రజాస్వామ్య విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడడమే విడ్డూరం. ప్రజాస్వామ్య సదస్సు లక్ష్యాలుగా ప్రతిపాదించిన మూడు అంశాల్లో నిరంకుశత్వాన్ని వ్యతిరేకించడం, అవినీతిపై పోరు, మానవ హక్కులను గౌరవించడం వంటివి వున్నాయి. ఈ మూడింటికి అతి పెద్ద ముప్పు అగ్ర రాజ్యం నుంచే ఎక్కువగా ఎదురవుతున్నది. మాది అతి పురాతన ప్రజాస్వామ్యం అని చెప్పుకునే అమెరికాలో ప్రజాస్వామ్యం ఎంతగా కుప్పకూలిందో గత ఏడాది జనవరిలో అమెరికన్‌ పార్లమెంటుపై జరిగిన దాడే తిరుగులేని నిదర్శనం. తన ప్రపంచాధిపత్యాన్ని సవాల్‌ చేసే దేశాల్లో దండెత్తి, ఆ దేశాలను సర్వనాశనం చేసిన చరిత్ర అమెరికాది. చిలీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని సైనిక కుట్ర ద్వారా కూల్చివేసిన పాపిష్టి చరిత్ర అమెరికాది. అమెరికన్‌ రాజకీయ వ్యవస్థ పట్ల ఆ దేశ ప్రజల్లో అసంతృప్తి ఎంతగా గూడుకట్టుకుందో ప్యూ రిసెర్చి సెంటర్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో మరోసారి స్పష్టమైంది. 17 శాతం మంది అమెరికన్లు మాత్రమే అమెరికా ప్రజాస్వామ్యం ఇతర దేశాలకు అనుసరణీయమని చెప్పారు. జర్మనీకి చెందిన రాబర్ట్‌ బాశ్చ్‌ ఫౌండేషన్‌ జరిపిన అధ్యయనంలో 50 శాతం మంది అమెరికన్లు తమ ప్రజాస్వామ్యం పని చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. మాది అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మన దేశంలో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాతంత్రయుత సంస్థలపైన దాడులు పెరిగిపోయాయి. రాజ్యాంగ మౌలిక విలువలైన లౌకికవాదం, ఫెడరలిజాన్ని దెబ్బ తీసేందుకు మోడీ ప్రభుత్వం చేయని యత్నం లేదు. ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రదమైన అసమ్మతి తెలిపే హక్కుపై ఉక్కు పాదం మోపుతున్నది. జెఎన్‌యు, జామియా మిలియా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై దాడులు, దేశ ద్రోహం కేసులు బనాయించడం, ప్రభుత్వాన్ని విమర్శించిన మేధావులను, జర్నలిస్టులను జైళ్లలో కుక్కడం, సోషల్‌ మీడియా గొంతు నొక్కడం, వ్యక్తిగత గోప్యతను హరించడం వంటి నిరంకుశ చర్యలకు ఒక వైపు నిర్లజ్జగా పాల్పడుతూ మరో వైపు నిరంకుశాధికారంపై పోరాడతామని చెప్పడం ప్రజలతో క్రూర పరిహాసమాడడమే. మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్‌లలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడం ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసింది. అవినీతి, మానవ హక్కుల గురించి ఇక ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యాన్ని పదహారడుగుల లోతున పూడ్చి పెట్టే ఈ బాపతు అంతా కలసి ప్రజాస్వామ్యానికి తామే పేటెంట్‌ అన్నట్లుగా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ప్రజాస్వామ్య సదస్సు పేరుతో క్వాడ్‌ల తరహాలో దక్షిణ ఆసియాలో చైనాకు వ్యతిరేకంగా మరో కూటమిని ఏర్పాటు చేయడమే బైడెన్‌ ప్రభుత్వ అసలు ఎజెండా. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజాస్వామ్యం లోని డొల్లతనం ఇప్పటికే అనేకసార్లు బయటపడింది. దీనికి సోషలిస్టు ప్రజాస్వామ్యమే అసలైన ప్రత్యామ్నాయం.