చిలమత్తూరు : మండల పరిధిలోని కోడూరు రెవెన్యూ పొలంలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. కోడూరు నుంచి సుబ్బరావుపేటకు వెళ్లే దారి పక్కన ఎపిఐఐసి ద్వారా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో ఎస్‌ఇజెడ్‌కు గతంలో భూములు తీసుకున్నారు. ఈ భూముల్లో సోమవారం నాడు కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. జెసిబిలతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటివల కురిసిన వర్షాలకు చెరువులు నిండకుండల్లా మారాయి. దీంతో మట్టి ఎక్కడా లభించకపోవడంతో గిరాకీ పెరిగింది. దూరాన్ని బట్టి ఒక్కో ట్రాక్టర్ మట్టిని రూ.400 నుంచి రూ.800 వరుకు అమ్ముతున్నారు. ఒక్కో టిప్పర్ రూ.2500 నుంచి రూ.3500 వరకు ధర పలుకుతోంది. ఇళ్ల నిర్మాణాలు, ఇతర అవసరాలకు మట్టికి గిరాకీ బాగా పెరిగింది. దీనిని అదునుగా చేసుకుని కొంత మంది గుత్తేదారులు సిండికేట్‌గా మారి స్థానికంగా ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో సెజ్ భూముల్లో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వి, ప్రజలకు మాత్రం వేలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. కోడూరు రెవెన్యూ పొలం మొరంపల్లి సమీపంలోని హబ్ భూముల్లో తవ్వకాలు చేపట్టి టిప్పర్ల ద్వార ఎర్రమట్టిని వందలాది లోడ్లు గ్రానైట్ పరిశ్రమల వద్ద కుప్పలుగా తోలుతున్నారు. దీనిపై సంబందిత అధికారులు స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ అక్రమ తరలింపులో వారికీ వాటాలున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైన రెవెన్యూ, మైనింగ్, ఎపిఐఐసి, విజలెన్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










