Jun 07,2023 16:08

న్యూఢిల్లీ   :  ప్రముఖ సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ రెడిట్‌ తన వర్క్‌ఫోర్స్‌లో ఐదు శాతం మందిని తొలగిస్తున్నట్లు రాయిటర్స్‌ మంగళవారం తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు 90 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఈ కంపెనీలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. లేఆఫ్‌ల సమాచారాన్ని కంపెనీ సిఇఒ హవ్‌మన్‌ ఉద్యోగులకు ఓ మెమో ద్వారా తెలిపినట్లు మీడియా తెలిపింది. 2024 చివరి నాటికి కంపెనీ ప్రణాళికలను సమీక్షించి ఓ కొలిక్కి తీసుకువస్తామని పేర్కొన్నారు. 'ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో కంపెనీ ఫలితాలు బాగానే ఉన్నాయని, ఈ పునర్‌ వ్యవస్థీకరణతో ద్వితీయార్ధంలో మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాదిలో నియామకాలు కూడా తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రముఖ టెక్‌ సంస్థలైన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటాలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.