పుట్టపర్తి అర్బన్ : రాష్ట్రంలో సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లిలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పల్లె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి, నాయకులు సామకోటి ఆదినారాయణ, దయ్యాల ఉమాపతి, రాజప్ప, గంగాద్రి, జయప్రకాష్, బేకరీ నాయుడు, మాల మనోహర్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మడకశిర: రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని టిడిపి నాయకులు విమర్శించారు. శనివారం స్థానికనగర పంచాయతీలో మూడవ వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని టిడిపి పట్టణ అధ్యక్షులు మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు భక్తర్, కౌన్సిలర్ నరసింహ రాజు, నాయకులు లక్ష్మీనారాయణ, నాగరాజు, శ్రీనివాసులు, శీనప్ప తదితరులు పాల్గొన్నారు.
అమడగూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రారంభించనున్న పాదయాత్రకు భయపడే వైసిపి ప్రభుత్వం జీవో 1 ను ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వల్లెపు సోమశేఖర్ విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయనీకకుండా వైసిపి ప్రభుత్వం అనేక కుయుక్తులు పన్నుతోందన్నారు. ఈ ప్రభుత్వానికి జీవోలంటే కామెడీ గా వుందన్నారు. వైసిపి పాలనతో ప్రజలు విసుగు చెందారని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు.










