Dec 27,2020 11:23

పేరు : స్వరా భాస్కర్‌
పుట్టిన తేదీ : ఏప్రిల్‌ 9, 1988
వృత్తి : బాలీవుడ్‌ హీరోయిన్‌
అవార్డులు : మూడు ఫిలింఫేర్‌ అవార్డులు
తండ్రి : సి. ఉదరుభాస్కర్‌
(రిటైర్డ్‌ నావికాదళ కమాండర్‌)
చదువు : ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్‌ డిగ్రీ, సోషియాలజీలో మాస్టర్స్‌
పేరు తెచ్చిన సినిమా : తనూ వెడ్స్‌ మను (2011)

నల్ల చట్టాలు రద్దు చేయాలి!


వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ శివార్లలో కొన్ని రోజులుగా రైతులు ఉద్యమం చేపడుతున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. కొత్త చట్టాలు రద్దు చేసేంతవరకూ వెనక్కితగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న బాలీవుడ్‌ నటి స్వరాభాస్కర్‌ వారికి మద్దతుగా నిలిచారు. ఈ మధ్య ఒకరోజు ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద అన్నదాతలతో కలిసి ఆందోళనలో కూర్చున్నారు. 'తాను రైతు కుటుంబం నుంచి రానప్పటికీ తనకు రైతులతో అనుబంధం ఉందని, తాను తినే రోటీ వారి వల్లే లభ్యమవుతోందని చెప్పారు. అందుకే రైతులకు తన సంఘీభావాన్ని తెలిపేందుకు నిరసనల్లో భాగమయ్యా! ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలి' అని చెబుతూ ట్విట్టర్‌ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేశారు.


స్వరాభాస్కర్‌ ఇప్పుడేకాదు గతంలోనూ లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల కష్టాలు చూసి చలించిపోయారు. తనకు చేతనైన సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి దగ్గరకు వెళ్లిన స్వరాకు ఎక్కువశాతం మంది కనీసం చెప్పులు కూడా లేకుండా ప్రయాణం సాగించడం ఆమెను తీవ్రంగా బాధించింది. వెంటనే సల్మాన్‌ఖాన్‌కు ఫోన్‌ చేసి, వలస కార్మికుల కష్టాలను వివరించింది. ఎందుకంటే ఆయన ఒక ప్రముఖ చెప్పుల బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనైతే ఆ సంస్థతో మాట్లాడి వలస కార్మికులకు చెప్పులు ఉచితంగా ఇప్పించగలరనేది ఆమె ఉద్దేశ్యం. స్వరా ఫోన్‌లో మాట్లాడిన వెంటనే సల్మాన్‌ఖాన్‌ ఆ సంస్థ అధికారితో మాట్లాడి, చెప్పులను పంపించారు. సమాజంలో జరిగే కొన్ని విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఎందరో మన్ననలు పొందుతున్నారు స్వరా. ఇంకా రైతుల ఉద్యమానికి మద్దతుగా ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌సింగ్‌ తన ఖేల్‌రత్న అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. పంజాబీ గాయకుడు దిల్జిత్‌ దోసాంజ్‌, సోనూసూద్‌, ప్రియాంక చోప్రా, ప్రీతీ జింటా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ వంటి మరికొందరు నటులూ రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.