ప్రజాశక్తి-పాలకొల్లు : సంక్షోభంలో ఉన్న ఆక్వా పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేయించడం దారుణమని కేవలం ఎన్నికల ఆర్థిక ప్రయోజనాలు కోసం దాడులు చేస్తొందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ చెప్పారు. పాలకొల్లులో జరుగుతున్న జిల్లా మహాసభలు సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. దాడులు వలన కొనుగోళ్లు నిలిచి పరిశ్రమ మూతబడిందని, కార్మికులకు పనిలేకుండా పోతోందని అన్నారు. ఈక్వేడర్లో ఆక్వా ఉత్పత్తి పెరగడంతో అమెరికా, యూరప్ లకు ఎగుమతులు తగ్గడం, చైనాతో సంబంధాలు తగ్గడం వలన ఎగుమతులు తగ్గాయని చెప్పారు. దీనితో ధరలు తగ్గడం వలన రైతులకు పెట్టుబడి రాని పరిస్థితి ఉందన్నారు. ఈ దశలో విజిలెన్స్ దాడులు రాష్ట్ర ప్రభుత్వ తుగ్లక్ చేష్ఠలుగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రొయ్యలు కొనుగోలు చేస్తామని చెప్పడం అవివేకంగా ఉందన్నారు. కోల్డ్ స్టోరేజ్ లు లేకుండా ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. చేతిలో పవర్ ఉందని పరిశ్రమ, రైతులకు పవర్ తీసేయడం భావ్యం కాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆక్వా పరిశ్రమ లాభాల్లో ఉండగా, కార్మికుల వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు.










