May 02,2023 10:41

ముంబయి : '' మహిళల శరీరాలు విలువైనవి. వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే వారికి అంత మంచిది '' అని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఓ టీవీ కార్యక్రమంలో అన్నారు. ఆదివారం రాత్రి ప్రసారమైన 'ఆప్‌ కీ అదాలత్‌' టీవీ కార్యక్రమంలో సల్మాన్‌ మాట్లాడారు.

సల్మాన్‌ టీవీ కార్యక్రమంలో నిన్న మాట్లాడటానికి ముందుగా ... సల్మాన్‌తో కలిసి 'కిసీ కా భాయ్.. కిసీ కా జాన్‌'లో నటించిన నటి పాలక్‌ తివారీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'సల్మాన్‌ తన సినిమా సెట్లో మహిళలందరూ మెడ వరకూ నిండుగా వస్త్రాలు ధరించేలా చూస్తారు' అని చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సల్మాన్‌పై పలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిన్న టీవీ కార్యక్రమంలో 'ఆప్‌ కీ అదాలత్‌' వ్యాఖ్యాత రజత్‌ శర్మ హీరో సల్మాన్‌ను ఓ ప్రశ్న అడిగారు.
' మీ సినిమా సెట్‌లోని మహిళలకు దుస్తుల విషయంలో నియమం పెట్టే మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటించడం ద్వంద్వ ప్రమాణాల కిందకు రాదా ? ' అని అడిగారు.
దీనిపై సల్మాన్‌ స్పందిస్తూ.. '' ఇందులో ద్వంద్వ ప్రమాణాలు లేవు. నా అభిప్రాయంలో మహిళల శరీరాలు విలువైనవి. వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే వారికి అంత మంచిది. ఇది మహిళల గురించి చెబుతున్న మాట కాదు. మన తల్లులు, భార్యలు, సోదరీమణుల్లాంటి మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్న మాట. మహిళలు అవమానాలకు గురికాకూడదని నేను కోరుకుంటున్నాను '' అని వివరించారు.