
- యెవ్‌గెని ప్రిగొజిన్
ప్రైవేట్ పారా మిలటరీ వాగర్ గ్రూపు అధిపతి యెవ్‌గెనీ ప్రిగొజిన్. ఇతగాడు గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా పరిగణించబడేవాడు. ఉక్రెయిన్‌పై దాడిలో వాగర్ గ్రూపు చురుకైన పాత్ర పోషించింది అయితే, గత కొంత కాలంగా పుతిన్ నాయకత్వంతో ప్రిగొజిన్‌కు సంబంధాలు చెడిపోయాయి. రష్యా సైనిక నాయకత్వాన్ని మార్చాలన్నది వాగర్ చీఫ్ ప్రిగొజిన్ ప్రధాన డిమాండ్. ఉక్రెయిన్‌లో పరాజయాలకు రష్యన్ రక్షణ మంత్రే కారణమన్నది ఆయన ఆరోపణ. రష్యా బలగాలు వాగర్ గ్రూపుపై కూడా దాడి చేస్తున్నాయని ఆరోపించాడు. రక్షణ మంత్రి సెర్గి షోయిగుపై విమర్శలు గుప్పించాడు. వాగర్ సైనికులను దేశద్రోహులుగా పుతిన్ అభివర్ణించారు. వారికి శిక్ష తప్పదని హెచ్చరించాడు.. అయితే తిరుగుబాటు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే బెలారస్ మధ్యవర్తిత్వంలో రొస్తావ్ నుంచి తన సైనికులను ఉపసంహరించుకుని బెలారస్‌లో ఆశ్రయం పొందారు.

- సెర్గి షోయిగు
2012నుండి రష్యా రక్షణమంత్రిగా వున్న షోయిగు ఉక్రెయిన్‌ఫై సైనిక చర్యకు నాయకత్వం వహిస్తున్న వారిలో ఒకరు. ఉక్రెయిన్‌పై ఏడాది కాలంగా సాగుతున్న యుద్ధంలో ఆయన అనేక యుద్ధ తప్పిదాలకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. పుతిన్‌కి అత్యంత ముఖ్యుల్లో ఒకరైనప్పటికీ, ఆయన విశ్వాసం ఎంతవరకు పొందుతున్నారనే దానిపై సందేహాలు వున్నాయి. 2014లో క్రిమియా ఆక్రమణలో విజయానికి ఆయనను ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కానీ ఉక్రెయిన్‌పై పోరు ప్రారంభమైనప్పటి నుండి ఆయన పేరు ప్రతిష్టలు తగ్గుతూ వస్తున్నాయి. పుతిన్ అనుకున్నట్లుగా ఉక్రెయిన్‌లో పోరు సాగడం లేదన్నది బహిరంగ రహస్యం. అదే పుతిన్ అసంతృప్తికి కారణం. ప్రిగోజిన్‌తో షోయిగు సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అవసరమైన ఆయుధాలు, తూటాలను అందచేయడంలో రక్షణ శాఖ విఫలమైందనేది ప్రిగోజిన్ ఆరోపణ.

- వాలెరి గెరాసిమొవ్
ఈ ఏడాది జనవరిలో ఉక్రెయిన్‌లో సైనిక బలగాల కమాండ్‌ను సెర్గి సురొవికిన్ నుండి గెరాసిమొవ్ తీసుకున్నారు. సిరియాలో రష్యా సైనిక ఆపరేషన్‌కు ఇంఛార్జిగా వ్యవహరించింది ఈయనే. . 2012లో షోయిగును రక్షణ మంత్రిగా ప్రకటించినపుడు ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా గెరాసిమొవ్ మొదటి డిప్యూటీగా చేశారు. షోయిగు, గెరాసిమొవ్ ఇద్దరిపైనా వాగర్ అధిపతి ప్రిగోజిన్ కత్తులు దూశాడు. ఉక్రెయిన్‌లో భారీ నష్టాలకు వారిద్దరే కారణమని నిందించాడు.

- సెర్గి సురొవికిన్
ఇప్పటివరకు రష్యా సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా వున్న సురొవికిన్ ప్రిగొజెన్‌కు మిత్రుడిగా భావిస్తారు. గెరాసిమొవ్‌కు ముందు ఆయనే జనరల్ కమాండర్‌గా వుండేవాడు. ఉక్రెయిన్‌తో ఘర్షణ మొదలైనప్పటి నుండి, వాగర్ చీఫ్‌కు వ్యతిరేకంగా మారినట్లు అగుపిస్తోంది. సురొవికిన్ ఈ అధికార పోరాటం ఆపాలంటూ శుక్రవారం సాయంత్రం ప్రిగొజెన్‌కు విజ్ఞప్తి చేశారు. మన అంతర్గత, రాజకీయ పరిస్థితులను మరింత తీవ్రతరం చేసేందుకు శత్రువు వేచి చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. అంతిమంగా పుతిన్ నాయకత్వాన్ని ఆమోదించాలని కోరాడు.










