Jun 30,2023 08:02
  • జూన్‌ ఆఖరొచ్చినా మారని పరిస్థితి
  • రెండొంతుల రాష్ట్రంలో వర్షాభావం శ్రీస్తంభించిన ఖరీఫ్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ ఏడాది జూన్‌ నెలాఖరొచ్చినా నైరుతి రుతుపవనాల ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. రాష్ట్రంలో దాదాపు రెండొంతుల భూభాగం వరా ్షభావాన్ని ఎదుర్కొంటోంది. ఎపిలో 26 జిల్లాలకుగాను గురువారంనాటికి 19 జిల్లాల్లో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షం నమోదైంది. నెల్లూరులో అత్యధికంగా 68.2 శాతం వర్షపులోటు నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 679 మండలాలుండగా 431 మండలాలు (64 శాతం) వర్షాభావంతో సతమతమవుతున్నాయి. నెల్లూరు జిల్లా దుత్తలూరు, అన్నమయ్య జిల్లా నందలూరు మండలాల్లో చినుకు పడలేదు. ఇంకా 150 మండలాలు అత్యల్పస్థాయి వర్షం (60 శాతంపైన లోటు) కేటగిరిలో ఉన్నాయి. తొలకరి వానల్లేక ఖరీఫ్‌ పనులు స్తంభించాయి. ఏరు వాక సజావుగా సాగట్లేదు. జూన్‌ నెలాఖరునాటికి సాగు కావాల్సిన విస్తీర్ణంలో సగమే సాగైంది. కాల్వల కింద ఇప్పుడిప్పుడే రైతులు సాగు పనులు చేపడుతున్నారు. వర్షాధారంపైనే ఆధారపడ్డ ప్రాంతాల్లో సేద్యం నిలిచిపోయింది.
 

                                                                            -31 శాతం తక్కువ

ఈ మారు రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కేరళలోకి జూన్‌ 8న ప్రవేశించగా మన రాష్ట్రంలోకి 11న వచ్చాయి. వాతావరణ అననుకూలత వలన 19 తర్వాత కాస్తంత పుంజుకున్నా ఆశించినంతగా వర్షాలు పడలేదు. జూన్‌లో ఇప్పటి వరకు నార్మల్‌గా 94.5 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 64.4 మిమీ మాత్రమే పడింది.
            31 శాతం తక్కువ వర్షం కురిసింది. అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరులో నార్మల్‌, బాపట్లలో నార్మల్‌ కంటే కొంచెం ఎక్కువ వర్షం నమోదైంది. మిగతా రాష్ట్రమంతటా వర్షాభావం తిష్టవేసింది.
 

                                                                          నెల గడిచిపోయింది

ఖరీఫ్‌లో జూన్‌ కీలకమైనది. తొలకరి వానలకు రైతులు సాగు పనులు ప్రారంభిస్తారు. నెలాఖరొచ్చినా తగిన వర్షాల్లేకపోవడంతో సేద్యపు పనులు నిలిచిపోయాయి. సాధారణంగా జూన్‌ మాసంలో 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాలి. కానీ 4 లక్షల ఎకరాల్లోనే పంటలేశారు. కావాల్సిన సేద్యంలో సగమే జరిగింది. నిరుడు ఈపాటికి 5.3 లక్షల ఎకరాల్లో పంటలేశారు. ఈ తడవ ప్రధాన జలాశయాల్లో ఒక మేరకు నీటి నిల్వలుండటంతో కాల్వలకు ముందుగానే సాగునీరు విడుదల చేశారు. జూన్‌ 1న గోదావరి డెల్టా, 7న కృష్ణా డెల్టా, 10న పెన్నా కింద అన్ని రిజర్వాయర్లకూ నీళ్లొదిలారు. పెన్నా కింద నెల్లూరు, తిరుపతిలోనే వరి నాట్లు కొద్దిగా సాగుతున్నాయి. కృష్ణా, గోదావరిలో సాగు బాగా నెమ్మదిగా సాగుతోంది. ఖరీఫ్‌లో ముందస్తుగా పంటలు సాగు చేసే ఉత్తరాంధ్రలో సైతం సాగు నెమ్మదిగా సాగుతోంది. వర్షాల్లేనందున వేరుశనగ, పత్తి, అపరాలు, చిరుధాన్యాల సాగు పరిస్థితీ అలాగే ఉంది.