May 23,2023 15:52

చండీఘర్‌ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సోమవారం అర్థరాత్రి అతని కారు దిగి ట్రక్కులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ట్రక్కు డ్రైవర్ల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌ ప్రయాణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం రాత్రి రాహుల్‌ సిమ్లాలోని తన సోదరి ప్రియాంక ఇంటికి వెళుతుండగా.. ఢిల్లీ- చండీఘర్‌ జాతీయ రహదారిపై తన కారును ఆపి.. ఓ ట్రక్కులో ప్రయాణించారు. హర్యానాలోని ముర్తాల్‌ నుండి అంబాలా వరకు ట్రక్కులో ప్రయాణించిన రాహుల్‌... డ్రైవర్ల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 'దేశవ్యాప్తంగా 90 లక్షల మంది లారీ డ్రైవర్లు ఉన్నారు. వారి మన్‌కీ బాత్‌ను రాహుల్‌ గాంధీ విన్నారు' అని కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. ఇక నెట్టింట్లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. 'మీరు అతనిని పార్లమెంటు నుండి అనర్హులుగా ప్రకటించవచ్చు. కానీ ప్రజల హృదయాల నుండి అతనిని ఎన్నటికీ అనర్హులుగా చేయలేరు' అని ట్విట్టర్‌ యూజర్‌ రాసుకొచ్చారు.
కాగా, రాహుల్‌గాంధీ గత నెల్లో బెంగాలీ మార్కెట్‌, మాజా మసీదు ప్రాంతాలను సందర్శించారు. అక్కడ ఆయన ప్రజల మధ్య లోకల్‌ ఫుడ్‌ని ఆస్వాదించిన సంగతి తెలిసిందే. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ హాస్టల్‌ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.