Jul 01,2023 10:55
  • స్పెక్ట్రా కంపెనీకి కట్టబెట్టిన ఆర్‌టిసి
  • డిపోలకు సిబ్బంది కేటాయింపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ ఆర్‌టిసిని సాహసోపేతంగా ప్రభుత్వంలో విలీనం చేశామని ఆర్భాటంగా చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం ఆచరణలో ఆర్‌టిసిని పూర్తిగా ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తోంది. గత నాలుగేళ్ల కాలంలో ఒక్క సొంత బస్సునూ కొనుగోలు చేయని ఎపిఎస్‌ ఆర్‌టిసి అద్దె బస్సులను పెంచుకుంటూ పోతోంది. అలాగే ముందస్తు రిజర్వేషన్‌ ప్రక్రియను ప్రైవేటుకు కట్టబెట్టినట్లుగానే ఇప్పుడు ఆర్‌టిసిలో వున్న జోనల్‌ వర్క్‌షాపులను ప్రైవేటీకరించేందుకు చర్యలు తీసుకోవడం పట్ల ఆర్‌టిసిలోని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జోనల్‌ వర్క్‌షాపుల నిర్వహణను జులై 1 నుంచి స్పెక్ట్రా అనే ప్రైవేటు కంపెనీకి ఇవ్వాలని ఆర్‌టిసి ఎమ్‌డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సుల నిర్వహణకు గానూ మూడు లేదా నాలుగు ఆర్‌టిసి రీజియన్‌లకు కలిపి ఒక వర్క్‌షాపు చొప్పున రాష్ట్రంలో నాలుగు వర్క్‌షాపులు ఉన్నాయి. విజయవాడ, కడప, నెల్లూరు, విజయనగరంలో వున్న వర్క్‌షాపుల్లో టైర్‌ రీట్రేడింగ్‌, స్టోర్స్‌, గ్యారేజీ వర్క్‌షాపుల్లో దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బస్సులకు సంబంధించి చిన్నచిన్న మరమ్మతులను డిపోల పరిధిలోనే చేస్తున్నా.. పూర్తి స్థాయి సర్వీసింగ్‌ బస్సులను వర్క్‌షాపులకు తరలిస్తారు. ఆర్‌టిసి బస్సులకు వినియోగించే టైర్ల రీట్రేడింగ్‌ ప్రక్రియంతా ఈ వర్క్‌షాపుల్లోనే జరుగుతుంది.
          ఎపిఎస్‌ ఆర్‌టిసికి ఇంత క్రియాశీలకమైన వర్క్‌షాపులను అడ్డగోలుగా ప్రైవేటుకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆర్‌టిసి నిర్వహణలో వున్న వర్క్‌షాపులను స్పెక్ట్రా కంపెనీకి కట్టబెడుతూ జూన్‌ 13న ఆర్‌టిసి ఎమ్‌డి ఉత్తర్వులు జారీచేశారు. బస్సుల ఓవరాయిలింగ్‌, టైర్‌ రీట్రేడింగ్‌ పనులను ఇచ్చేశారు. ప్రైవేట్‌ కంపెనీ బస్సుకు ఏ రిపేర్‌ చేసినా ఆ మేరకు ఛార్జీలు చెల్లించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెల్లూరు జోనల్‌ వర్క్‌షాపులో ఎపిపిటిడి, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ తీవ్రంగా ప్రతిఘటించాయి. విజయవాడ, కడప, విజయనగరంలలో వుండే జోనల్‌ వర్క్‌షాపులను స్పెక్ట్రా కంపెనీకి కట్టబెట్టారు. ఇప్పటి వరకూ ఆర్‌టిసి సిబ్బంది చేసే పనులను ఇప్పుడు అదే వర్క్‌షాపులో ప్రైవేట్‌ వ్యక్తులు వచ్చి చేస్తారు. ఈ మేరకు జోనల్‌ వర్క్‌షాపులో వున్న సిబ్బందిని మొత్తం డిపోలకు బదలాయించారు. జోనల్‌ వర్క్‌షాపులు ఆర్‌టిసి నిర్వహణలోనే వుండాలని ఎపిఎస్‌ ఆర్‌టిసి ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ సుందరయ్య 'ప్రజాశక్తి'తో అన్నారు. ఆర్‌టిసిలో ఎన్నో దశాబ్దాలుగా సేవలు అందించిన జోనల్‌ వర్క్‌షాపులను ప్రైవేట్‌పరం చేయడం సరైంది కాదని, ఈ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.